ఫెడరల్ ఫ్రంట్ కధ ఏమైంది? జైపాల్ రెడ్డి

June 26, 2018


img

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కాంగ్రెస్ పార్టీకి విసిరిన ‘ముందస్తు ఎన్నికల’ సవాలు సరిగ్గా తగలవలసిన చోటే తగిలినట్లుంది. టి-కాంగ్రెస్ నేతలందరూ తమకు ఏదో ఎదురుదెబ్బ తగిలినట్లుగా తీవ్రంగా స్పందిస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కెసిఆర్ తనకొక్కడికే తెలివితేటలు ఉన్నాయనుకుంటారు. అలాగే మాయమాటలు చెపుతూ అందరినీ మోసం చేయగలనని అనుకుంటారు. ఒకపక్క ఫెడరల్ ఫ్రంట్ అని హడావుడి చేస్తూ మరోపక్క ప్రధాని నరేంద్రమోడీతో దోస్తీ చేస్తుంటారు. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ఊసే ఎత్తడం లేదు..ఎందుకో? ఇంతకీ ఫెడరల్ ఫ్రంట్ ఉంటుందా లేదా? ఉంటే అదిప్పుడు ఎక్కడుంది? మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తున్న కెసిఆర్ కు రాబోయే ఎన్నికలలో గట్టిగా బుద్ధి చెపుతాము. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావడం తధ్యం,” అని అన్నారు. 

జైపాల్ రెడ్డి కూడా కెసిఆర్ వ్యూహాలను సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారని అయన మాటలనుబట్టి అర్ధమవుతోంది. కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను సరిగ్గా కర్ణాటక శాసనసభ ఎన్నికలకు ఒకటి రెండు నెలల ముందు తెరపైకి తెచ్చారు. కాంగ్రెస్, భాజపాలు కీలకంగా భావించిన ఆ ఎన్నికలలో వాటికి తన సత్తా ఏమిటో రుచి చూపించాలనే ఆలోచనతోనే బహుశః అయన ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన తెరపైకి తెచ్చి ఉండవచ్చు. ఆ పని పూర్తయింది కనుక ఎన్నికలు పూర్తయ్యాక ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను పక్కనపెట్టారు.

కానీ ఫెడరల్ ఫ్రంట్ ఆశయానికి విరుద్దంగా ఆ ఎన్నికలలో కాంగ్రెస్, భాజపాలలో ఏదో ఒక పార్టీతో చేతులు కలుపబోతున్న జెడిఎస్ కు అయన మద్దతు ప్రకటించారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీతో కలిసి జెడిఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా కెసిఆర్ స్వయంగా బెంగళూరు వెళ్లి కుమారస్వామిని అభినందించివచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీతో జెడిఎస్ చేతులు కలిపినా తనకు అభ్యంతరం లేదని చెప్పినట్లయింది. 

ఆ తరువాత డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యి ఆయన ప్రతిపాదనలకు కూడా ‘సంపూర్ణ మద్దతు’ ప్రకటించారు. అంటే మోడీ సర్కార్ పట్ల కూడా తనకు ఏమాత్రం వ్యతిరేకత లేదని స్పష్టంగానే చెప్పినట్లు భావించవచ్చు. 

తెలంగాణాలో తెరాస జోలికి రానంతవరకు ఆ రెండు పార్టీలకు తాను వ్యతిరేకమూ, అనుకూలమూ కాదని కెసిఆర్ చెప్పకనే చెప్పినట్లుంది. కానీ తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెరాసకు సవాలు విసురుతున్నందునే కెసిఆర్ దానిని గట్టిగా ఎదుర్కొంటున్నారు. ఒకవేళ భాజపా నుంచి కూడా తెరాసకు ప్రమాదం ఉందని కెసిఆర్ భావిస్తే అప్పుడు తప్పకుండా దానితో కూడా ఇదేవిధంగా వ్యవహరించవచ్చు. 


Related Post