‘ముందస్తు’ ఆలోచన దేనికో?

June 26, 2018


img

సిఎం కెసిఆర్ డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయ్యి తిరిగి వచ్చిన కొద్దిరోజులకే కాంగ్రెస్ పార్టీకి ముందస్తు ఎన్నికల సవాలు విసిరారు. అదేసమయంలో సార్వత్రిక ఎన్నికలు డిసెంబర్ లోగా జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. ఏపిలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కూడా ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని, క్యాడర్ అందుకు సిద్దంగా ఉండాలని పదేపదే చెపుతున్నారు. కనుక తెలంగాణాలో అంతకంటే ముందుగా శాసనసభ ఎన్నికలు వస్తాయనుకోలేము. 

ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్లుగా సిఎం కెసిఆర్, మంత్రులు అందరూ కలిసి గవర్నర్ నరసింహన్ కు  రాజీనామా లేఖలను ఇచ్చినా తెరాస ప్రభుత్వం రద్దు అవుతుంతే తప్ప వెంటనే ఎన్నికలు జరుగవు. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది తప్ప కెసిఆర్ కాదు. 

ఒకవేళ తెరాస సర్కార్ రద్దయితే డిసెంబర్ వరకు రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించవచ్చు. ఏ పార్టీ కూడా ఎన్నికలకు ముందు చేతిలో ఉన్న అధికారం వదులుకొని ఇబ్బందిపడాలని కోరుకోదు. ఎందుకంటే చేతిలో అధికారం ఉన్నప్పుడే ఎన్నికలను ఎదుర్కోవడం మరింత సులువు అవుతుంది. ఇవన్నీ కెసిఆర్ కు తెలియకనే మాట్లాడారనుకోలేము. కనుక కాంగ్రెస్ పార్టీ మనోధైర్యాన్ని దెబ్బ తీయడానికే సిఎం కెసిఆర్ ‘ముందస్తు’ అన్నారు తప్ప రాజీనామా చేయాలనే ఉద్దేశ్యంతో కాదని చెప్పవచ్చు. ఈ ముందస్తు మాటతో ప్రతిపక్షాలలో అలజడి సృష్టించడమే కాకుండా తెరాసలో అసంతృప్తనేతల నోళ్లకు కూడా తాళాలు వేసినట్లవుతుంది. బహుశః అందుకే ఈ ముందస్తు మాట అని ఉండవచ్చు. 


Related Post