ఆ 15మందిలో వాళ్ళు లేరా?

June 25, 2018


img

దానం నాగేందర్ తెరాసలో చేరిక సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీలోని మరో 10-15మంది నేతలు తెరాసలో చేరడానికి సిద్దంగా ఉన్నారు. అయితే వారు పదవులు ఆశిస్తున్నందున వారిని పార్టీలో చేర్చుకోవడంలో ఆలస్యం జరుగుతోంది. కానీ కష్టపడి పనిచేసేవారికి తెరాస ఎప్పుడూ స్వాగతం పలుకుతుంది. పార్టీలో సముచిత గౌరవం లభిస్తుంది,” అని అన్నారు.

దానం నాగేందర్ రాజీనామా చేసిన తరువాత సీనియర్ కాంగ్రెస్ నేతలు ముఖేష్ గౌడ్ అయన కుమారుడు విక్రంగౌడ్ తెరాసలో చేరిపోవడానికి సిద్దంగా ఉన్నారని మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. సిఎం కెసిఆర్ చెప్పిన మాటలు అందుకు తగ్గట్లుగానే ఉండటంతో, ఏఐసిసిలో తెలంగాణా కార్యదర్శులుగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాస కృష్ణన్ వారిరువురినీ హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు పిలిపించుకొని మాట్లాడారు. వారితోపాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ కుంతియా, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, డికె అరుణ తదితరులు కూడా వారిరువురితో మాట్లాడారు. తాము తెరాసలో చేరుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను వారిరువురూ ఖండించారు. తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని హామీ ఇచ్చారు. ఇది తెరాస ఆడుతున్న మైండ్ గేమ్ లో భాగమని వారు అనుమానం వ్యక్తం చేశారు. 

అయితే నిప్పు లేనిదే పొగరాదన్నట్లు ఏ ఆధారం లేకుండానే ముఖేష్ గౌడ్, విక్రంగౌడ్ లు పార్టీ మారే అవకాశం ఉందని మీడియా చెపుతుందని అనుకోలేము. దానం నాగేందర్ తెరాసలో చేరబోతున్నారని గతంలో మీడియాలో వచ్చిన వార్తలే ఇప్పుడు నిజమయ్యాయి. కనుక కెసిఆర్ చెప్పిన ఆ 10-15 మంది కాంగ్రెస్ నేతలలో వారిరువురూ కూడా ఉన్నారా లేదా? ఆ జాబితాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే విషయాలు త్వరలోనే బయటపడవచ్చు. కనుక కాంగ్రెస్ పార్టీ ఆ దెబ్బను తట్టుకునేందుకు సిద్దంగా ఉంటే మంచిదేమో?


Related Post