మేము కూడా రెడీ: ఉత్తమ్ కుమార్ రెడ్డి

June 25, 2018


img

“రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఇలాగే చిల్లర రాజకీయాలు చేస్తుంటే ముందస్తు ఎన్నికలకు పోదామని కోరుతాను. అప్పుడు అధికారంలో ఎవరు ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారు,” అని సిఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించారు. 

“వచ్చే మేలో లేదా 2018 డిసెంబరులో లేదా ఇవ్వాళ్ళే ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉంది. అప్రజాస్వామిక, అవినీతి పాలన సాగిస్తున్న తెరాస సర్కార్ ను గద్దె దించడానికి సిద్దంగా ఉంది. ముందస్తు ఎన్నికలు తెలంగాణా ప్రజలకు ఒక శుభవార్తవంటివి ఎందుకంటే సిఎం కెసిఆర్ ను మరికొన్ని నెలల ముందుగా వదిలించుకొనే అవకాశం లభిస్తుంది,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు. 

దానం నాగేందర్ పార్టీని వీడటం కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ కాదనే చెప్పాలి. కానీ మరో 10-15 మంది కాంగ్రెస్ నేతలు తెరాసలో చేరడానికి సిద్దంగా ఉన్నారని సిఎం కెసిఆర్ నిన్న చేసిన ప్రకటన టి-కాంగ్రెస్ కు చాలా పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. 

కనుక పార్టీ శ్రేణుల మనోధైర్యం కాపాడుకునేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించి ఉండవచ్చు. అయితే ఇటువంటి ‘రొటీన్ ప్రకటన’తో సరిపెడితే టి-కాంగ్రెస్ చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచిస్తున్నట్లుగా వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోయే కాంగ్రెస్ అభ్యర్ధుల పేర్లను, వీలైతే ముఖ్యమంత్రి అభ్యర్ధి పేరును కూడా వీలైనంత త్వరగా ప్రకటించినట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాస్తవ పరిస్థితిపై స్పష్టత వస్తుంది. టికెట్స్ లభించని నేతలు అసంతృప్తి చెంది పార్టీని వీడే అవకాశం ఉన్నప్పటికీ, పార్టీ పరిస్థితి ముందుగానే తెలుస్తుంది కనుక తదనుగుణంగా చర్యలు, వ్యూహాలు సిద్దం చేసుకోవచ్చు. 



Related Post