అందుకే కెసిఆర్ అంత నమ్మకంగా చెపుతున్నారా?

June 25, 2018


img

దానం నాగేందర్ తెరాసలో చేరిన సందర్భంగా సిఎం కెసిఆర్ ముందస్తు ఎన్నికలు, తెరాస విజయావకాశాల గురించి మరోమారు మాట్లాడారు. “ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొవడానికి తెరాస సిద్దంగా ఉంది. మరి ప్రతిపక్షాలు సిద్దంగా ఉన్నాయా?”అని ప్రశ్నించారు. 

“ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెరాస 100 కంటే ఎక్కువ సీట్లే గెల్చుకోవడం ఖాయం అని రెండుసర్వేలలో తేలింది. మరో రెండు మూడు రోజులలోనే మూడో సర్వే ఫలితాలు కూడా ప్రకటించబోతున్నాను. గత నాలుగేళ్ళలో రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికలలో ప్రజలు మాపక్షాన్నే ఉన్నారని నిరూపితమైంది. వచ్చే ఎన్నికలలో తెరాస 100కు పైబడి సీట్లు గెలుచుకోవడం ఖాయం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అంతేకాదు...వచ్చే ఎన్నికలలో మా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ 50-60,000 మెజారిటీతో గెలవబోతున్నారు. రాష్ట్రంలో 82స్థానాలలో 60 శాతానికి పైగా మాకే ఓట్లుపడతాయని ఖచ్చితంగా చెప్పగలను. వచ్చే ఎన్నికలలో విపక్షలన్నీ కలిసి పోటీచేసినా గెలువలేవు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రతిపక్షాలు చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోతాయని సర్వే నివేదికలలో చూసినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. ఈసారి ముందుగా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. వాటికి తెరాస సిద్ధంగా ఉంది,” అని సిఎం కెసిఆర్ అన్నారు.

“వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలోగల 119 సీట్లలో తెరాస 100కు పైగా గెలుచుకొంటుంది. ప్రతిపక్షాలు డిపాజిట్లు కోల్పోతాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి మరో డజనుకుపైగా నేతలు తెరాసలో చేరబోతున్నారు,” అని సిఎం కెసిఆర్ మాటలు ప్రతిపక్షాల...ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మనోధైర్యం దెబ్బతీయడానికేనని అర్ధమవుతోంది. అయితే డిల్లీ, యూపి శాసనసభ ఎన్నికలలో ప్రజలు ఏకపక్షంగా తీర్పు చెప్పినట్లుగానే, వచ్చే ఎన్నికలలో తెలంగాణా ప్రజలు కూడా ఏకపక్షంగా తీర్పుచెప్పే అవకాశం కూడా ఉంది. కనుక కెసిఆర్ మాటలను తేలికగా తీసుకోవడం కూడా సరికాదు. తెరాస ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ తెరాస సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాల కారణంగా తెరాసకు మంచి ప్రజాధారణ ఉన్నమాట వాస్తవం. దానిని ఓట్లరూపంలోకి మార్చుకోవడం ఎలాగో సిఎం కెసిఆర్ కు తెలిసినట్లు మరెవరికీ తెలియదనే చెప్పాలి. 

అయితే తెరాసకు ఎంత ప్రజాధారణ ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు బలపడితే అవి సవాలు విసురుతూనే ఉంటాయి. కనుక వాటిని ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయన ఇప్పటికే తెదేపా పనిపూర్తి చేశారు. తరువాత కాంగ్రెస్ వంతు అని భావించవలసి ఉంటుంది. దానం నాగేందర్ చేరిక అందుకు తాజా ఉదాహరణ. సిఎం కెసిఆర్ చెప్పినట్లుగా మరో 10-15 మంది కాంగ్రెస్ నేతలు తెరాసలో చేరడం ఖాయమైతే టి-కాంగ్రెస్ పని ఖతం అయినట్లే. 

ఇక రాష్ట్రంలో భాజపా పరిస్థితి ఏవిధంగా ఉందో అందరికీ తెలుసు కనుక సిఎం కెసిఆర్ దానిని పెద్దగా పట్టించుకోవడం లేదనుకోవాలి. దాని వలన తెరాసకు ప్రమాదం లేదని భావిస్తునందునే కేంద్రంతో సఖ్యతగా వ్యవహరిస్తున్నారని భావించవచ్చు. లేకుంటే రాష్ట్ర భాజపాపై కూడా దృష్టి పెట్టి ఉండేవారేమో?

ఒక పక్క ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తూనే తెరాసకు అన్నివిధాల ఉపయోగపడే మజ్లీస్ పార్టీతో బలమైన స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో తెరాస-మజ్లీస్ పార్టీలు కలిసే పోటీ చేయడం ఖరారు అయినట్లే భావించవచ్చు.  కనుక ఈ సర్వేలు, లెక్కలు, సమీకరణలు, వ్యూహాలు అన్నీ లెక్కగట్టుకునే కెసిఆర్ 100కు పైగా సీట్లు గెలుచుకుంటామని చెపుతునట్లు భావించవచ్చు.


Related Post