కెసిఆర్ తిట్టేది వారినే...తెచ్చి పెట్టుకునేది వారినే

June 25, 2018


img

సీనియర్ కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఆదివారం సిఎం కెసిఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. అయన చేరిక కంటే ఆ సందర్భంగా సిఎం కెసిఆర్ టి-కాంగ్రెస్ నేతలను ఉద్దేశ్యించి చేసిన విమర్శలు ఆసక్తికరంగా ఉన్నాయి. 

దానం నాగేందర్ చేరిక సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, “అసెంబ్లీలో ఏమి మాట్లాడాలో తెలియని ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి నాయకుడు. కాంగ్రెస్ హయంలో తెలంగాణా ప్రజలను, ఉద్యోగులను, రైతులను ఎవరినీ  పట్టించుకోలేదు. గత పాలకులు ఇక విద్యా, వైద్య, విద్యుత్, సాగునీరు, వ్యవసాయ రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. హైదరాబాద్ ను ఒక పెద్ద మురికికుంటగా మార్చేసిపోయారు. కాంగ్రెస్ నేతలకు అధికారం కోసం రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసు. కానీ మా ప్రభుత్వానికి రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం ఒక టాస్క్. అదే లక్ష్యంతో మా మంత్రులు, అధికారులు అందరం పనిచేస్తున్నాము.” 

“దానం నాగేందర్ ఒక సమర్ధుడైన నాయకుడు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవముంది. రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలుపంచుకోవడానికి వచ్చారు. ఆయనకు సాదరంగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాము. అయితే తెరాసలో చేరడమంటే పదవీ, అధికారం అనుభవించడం కాదు. నెత్తిన ఒక బండ మోయడమేనని అందరికీ తెలుసు. నిత్యం ప్రజలలో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ, రాష్ట్రాభివృద్ధికి రేయింబవళ్ళు పనిచేయాలి. అందుకు అయన సిద్దపడే పార్టీలోకి వచ్చారు. ఇంకా మరో 10-15 మంది కాంగ్రెస్ నేతలు మాపార్తీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. దానం నాగేందర్ కు మాపార్టీలో ఉజ్వల భవిష్యత్ ఉంటుంది,” అని అన్నారు. 

“కష్టపడి పనిచేసేవారికి ఎప్పుడూ ప్రజాధారణ ఉంటుంది. ఇక్కడ మన ప్రభుత్వం, పొరుగున ఓడిశాలో నవీన్ పట్నాయక్, మధ్యప్రదేశ్ లో రమణ్ సింగ్, ఛత్తీస్ ఘడ్ లో శివరాజ్ సింగ్ ల ప్రభుత్వాలు అందుకు చక్కటి ఉదాహరణలు. అసలు ఇప్పుడున్న టి-కాంగ్రెస్ నేతలలో ఏ ఒక్కరికీ కూడా రాష్ట్రాన్ని పాలించిన అనుభవం లేదు. కానీ అధికారంలోకి రావాలని కలలు కంటుంటారు. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తారో ప్రజలకు చెప్పరు. ఎప్పుడూ నన్ను గద్దె దించడమే లక్ష్యం అంటారు. ఇదేమి దౌర్భాగ్యరాజకీయాలో తెలీదు. పోనీ ఎన్నికలకు పోదామా? ప్రజలే తేలుస్తారు ఎవరికి అధికారం కట్టబెట్టాలో?” అని కెసిఆర్ సవాల్ విసిరారు.  

“తెలంగాణా ఉద్యమసమయంలో కెసిఆర్ ఎక్కడ ఉన్నాడని జైపాల్ రెడ్డి ప్రశ్నిస్తాడు. ఆయనకు ఏమి సమాధానం చెప్పాలో అర్ధం కాదు. కాంగ్రెస్ నేతలకు ఏమి మాట్లాడాలో కూడా తెలియదు. అధికార పార్టీని ఏవిధంగా ఎదుర్కోవాలో కూడా తెలియని అయోమయంలో ఉన్న ఇటువంటి మందబుద్దిగల ప్రతిపక్షాలు కలిగి ఉండటం వలన మావాళ్ళు కూడా మొద్దుబారిపోతున్నారు. ప్రతిపక్షాలు తెలివిగా, చురుకుగా ఉన్నప్పుడే కదా మావాళ్ళు అప్రమత్తంగా ఉంటారు,” అని కెసిఆర్ కాంగ్రెస్ నేతలను ఎద్దేవా చేశారు. 

విశేషమేమిటంటే, సిఎం కెసిఆర్ ఒక పక్క కాంగ్రెస్ పార్టీలో నుంచి ‘మంచి సమర్ధులైన’ నాయకులను తెరాసలోకి రప్పించుకుంటూనే, వారి సమక్షంలోనే కాంగ్రెస్ నేతలను సన్నాసులు, దద్దమ్మలు, రాష్ట్రాన్ని దోచుకుతిని అన్నివిధాల భ్రష్టు పట్టించినవారు అంటూ విమర్శిస్తుంటారు. మరి అటువంటి బుద్ధిహీనులైన, స్వార్ధపరులైన కాంగ్రెస్ నేతలను తెరాసలో చేర్చుకోవడం ఎందుకు? కాంగ్రెస్ లో ఉన్నప్పుడు తెలంగాణాకు అన్యాయం చేసి, స్వార్ధంగా వ్యవహరించిన కాంగ్రెస్ నేతలు తెరాసలో చేరగానే పవిత్రులు, నిస్వార్ధ ప్రజాసేవకులు ఎలా అయిపోతారు? అటువంటి స్వార్ధ, అవివేకమైన నేతలను కాంగ్రెస్ పార్టీలో నుంచి తెచ్చుకొనే బదులు తెలంగాణా కోసం నిస్వార్ధంగా పోరాడినవారు ఎందరో తెరాసలోనే ఉన్నారు కదా! వారికే పార్టీలో ప్రాధాన్యం, పదవులు ఇవ్వవచ్చు కదా? అనే సందేహాలు కలుగుతాయి. తమ సమక్షంలోనే సిఎం కెసిఆర్ కాంగ్రెస్ పార్టీని, దానిలో నేతలను నోరారా తిట్టిపోస్తున్నా తెరాసలో చేరిన కాంగ్రెస్ నేతలు దానిని తప్పుగా, అవమానంగా భావించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.


Related Post