తెలంగాణాకు ముగ్గురు ఏఐసిసి కార్యదర్శులు

June 23, 2018


img

దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఎక్కువ ఉన్న రాష్ట్రాలలో తెలంగాణా ఒకటని ఆపార్టీ అధిష్టానం భావిస్తున్నందున రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లుంది. ఇప్పటివరకు తెలంగాణా వ్యవహారాలను ఏఐసిసిలో ఒకే కార్యదర్శి (సతీష్ ఝార్కొహిలి) చూసుకునేవారు. ఇప్పుడు అయన స్థానంలో రాహుల్ గాంధీ ముగ్గురిని నియమించారు. 

వారిలో కర్ణాటకకు చెందిన ఎన్.ఎస్.బోస్ రాజు, సలీం అహ్మద్, కేరళకు చెందిన శ్రీనివాసన్ కృష్ణన్ ఉన్నారు. ఉత్తర, దక్షిణ, మద్య తెలంగాణాలలోని నియోజకవర్గాలను మూడు భాగాలుగా విభజించి వారికి వాటి బాధ్యతలు అప్పగించారు. వారి పరిధిలో ఉన్న తెలంగాణా ప్రాంతంలోని నియోజకవర్గాలలో టికెట్ల కేటాయింపు విషయంలో వారికి రాహుల్ గాంధీ స్వేచ్చనిచ్చారు. కనుక ఈసారి కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయిలోనే టికెట్స్ కేటాయింపు చేసి వాటికి లాంఛనంగా అధిష్టానం చేత ఆమోదముద్ర వేయించుకునే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఇది ఒక విన్నూత్నమైన ప్రయోగమే అని చెప్పవచ్చు. 

అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టి-కాంగ్రెస్ పార్టీలో నేతల మద్య విభేదాలు, ముఠాలు, వాటిమధ్య ఆధిపత్యపోరు బయటపడుతుండటం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇప్పుడు మూడు ప్రాంతాలను వేరు చేసి వాటికి ముగ్గురు కార్యదర్శులను నియమించారు కనుక వారు టి-కాంగ్రెస్ లోని ఈ ముఠాలను ఏమైనా నియంత్రించగలరేమో చూడాలి. టి-కాంగ్రెస్ నేతలు తమ ఈ బలహీనతను అధిగమించగలిగితే వారి విజయావకాశాలు మెరుగవుతాయి. లేకుంటే 2014 ఎన్నికల ఫలితాలు పునరావృతంకావచ్చు. 


Related Post