దానం వెళ్ళిపోతే ఏమవుతుంది? కోమటిరెడ్డి

June 23, 2018


img

దానం నాగేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటం, వీడుతూ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేయడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు. “నిజానికి ఆయన రెండేళ్ళ నుంచి తెరాసలోకి వెళ్ళిపోయేందుకు మూటాముల్లె సర్దుకుని కూర్చున్నాడు. అందుకోసం ఫ్లెక్సీ బ్యానర్లు కూడా ముద్రించుకున్నాడు. అటువంటి వ్యక్తి వెళ్ళిపోతే ఎవరూ బాధపడనవసరం లేదు. అయనకు పదవుల కోసం పార్టీలు మారడం కొత్తేమి కాదు. ఇదివరకు తెదేపా నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొందాడు. ఇప్పుడూ ఏదో పదవి ఆశించే తెరాసలో చేరుతున్నాడు. కానీ ఇంతకాలం పార్టీలో పదవులు, గౌరవం అన్నీ పొందిన అయన పోతూపోతూ కాంగ్రెస్ పార్టీలో బిసిలకు న్యాయం జరగడం లేదని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉంది. నిజానికి కాంగ్రెస్ పార్టీలో మాత్రమే అన్ని కులాలు, మతాల వారికి సమానావకాశాలు, గౌరవం లభిస్తాయి. ఆయన వెళుతున్న తెరాసలో దళితులకు గౌరవం లభిస్తోందా? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి కెసిఆర్ ఆ పదవి చేపట్టినమాట నిజం కాదా?కేసిఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా ఎందుకు అవకాశం కల్పించలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు, మహిళలకు అవకాశాలు కల్పించిన మాట దానంకు గుర్తు లేదా? అయన వెళ్ళిపోతే ఏమీ కాదు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించుకోగలమని చెప్పగలను,” అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 


Related Post