కెసిఆర్, కెకెలపై టిజివెంకటేష్ అనుచిత వ్యాఖ్యలు

June 23, 2018


img

ఏపి తెదేపా ఎంపి టిజి వెంకటేష్ తెలంగాణా సిఎం కెసిఆర్, తెరాస ఎంపి కె.కేశవరావులపై అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఇటీవల డిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సిఎం కెసిఆర్ ఏపికి ప్రత్యేకహోదా, విభజన హామీల గురించి కేంద్రాన్ని ప్రశ్నించకపోవడాన్ని టిజి వెంకటేష్ తప్పు పట్టారు. దానిపై తెరాస నేతలు ఆయనకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మళ్ళీ అయన అంతకంటే ఘాటుగా, చాలా అనుచితంగా స్పందించారు. తెరాస ఎంపి కె.కేశవరావుపై తన దాడిని కొనసాగిస్తూ, “ఆయన ఏమి మాట్లాడుతారో ఆయనకే అర్ధం కాదు. అందుకే అయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అందరూ ఆయనను ‘పిచ్చోడు’ అని అనేవారు. ఆయనకు రాత్రయితే ఫుల్ గా మందుకొట్టి సిఎం కెసిఆర్ కాళ్ళు ఒత్తడమే తప్ప మరేమి తెలియదు. అటువంటి వ్యక్తికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి ఇప్పించాలని కెసిఆర్ ప్రయత్నిస్తే ఎవరూ ఆయనకు సహకరించరు. కెసిఆర్ తెలంగాణా ఉద్యమం నడుపుతున్నప్పుడు కెకె ఎక్కడున్నారు? కెకె వంటి బుద్ధిలేని నేతలను పెట్టుకుని కెసిఆర్ పాలన చేస్తే ఆయనకే నష్టం అని నేను చెప్పడం తప్పా? ఏపి సమస్యలపై తెరాస సర్కార్ స్పందించకుంటే హైదరాబాద్ లో ఉన్న ఏపి ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవలసివస్తుందని చెప్పడం చిల్లర రాజకీయాలా? నావి చిల్లర రాజకీయలైతే మీరు వాటిని ఎందుకు పట్టించుకుంటున్నారు? మోడీ సర్కార్ ఏపిని మోసం చేసింది. కనుక మోడీతో కెసిఆర్ కలిసిసాగాలనుకుంటే ప్రజలు క్షమించరని కెసిఆర్ గ్రహించాలి, అని టిజి వెంకటేష్ హెచ్చరించారు.  

ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం లేకుండా టిజి వెంకటేష్ సిఎం కెసిఆర్ ను ఉద్దేశ్యించి ఈవిధంగా మాట్లాడుతారనుకోలేము. తెదేపా కేంద్రంపై యుద్ధం ప్రకటించింది కనుక తెరాస కూడా కేంద్రాన్ని శత్రువుగా భావించాలని టిజి వెంకటేష్ మాటల ద్వారా అర్ధమవుతోంది. అయితే తెలంగాణాలో భాజపాకు తెదేపా దూరమైన తరువాత కూడా ఏపిలో తెదేపా-భాజపాలు చాలా కాలంపాటు సఖ్యతగానే కొనసాగాయి. ఆ తరువాత రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భాజపా, మోడీ సర్కార్ తో తెగతెంపులు చేసుకొంది. అప్పటి నుంచే భాజపాను తెదేపా ద్వేషించడం మొదలుపెట్టింది. భాజపా, మోడీ సర్కార్ లను తెదేపా ద్వేషిస్తోంది కనుక తెరాస కూడా శత్రువుగా భావిస్తూ ద్వేషించాలని తెదేపా కోరుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.


Related Post