ఏమి జరుగుతోందో ఆమెకు తెలియదా?

June 21, 2018


img

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పధకాలలో మిషన్ భగీరథ ఒకటి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ప్రతీ గ్రామంలో ప్రతీ ఇంటికీ మంచినీళ్ళు అందించాలని లక్ష్యంగా పెట్టుకుని పనులు చేస్తున్నారు. హన్మకొండలోని నందన గార్డెన్స్ లో బుధవారం మిషన్ భగీరథ పధకం పురోగతిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఆ సమావేశంలో పాల్గొన్న మిషన్ భగీరథ పధకం కార్యదర్శి స్మితాసభర్వాల్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాతో సహా దాదాపు అన్ని జిల్లాలలో 90 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం కూడా త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు. ఆమె మాట్లాడుతుండగా పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర్ రావు, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అడ్డుపడి షాక్ ఇచ్చారు.

ఆమె చెపుతున్న మాటలు నిజంకావని, మిషన్ భగీరధ అధికారులు, ఇంజనీర్లు ఆమెకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, వారి మాటలు నమ్మి మిషన్ భగీరథ పధకం 90 శాతం పూర్తయిందని ఆమె చెప్పడం సరికాదని ఆమె మొహం మీదనే చెప్పేశారు. ఆ పధకం ఏవిధంగా నత్తనడకలు సాగుతోందో తెలుసుకోవాలంటే ఆమె స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి చూడవచ్చని వారు సవాలు విసిరారు. దాంతో ఆమెతో సహా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆ సమావేశంలో పాల్గొన్న మిషన్ భగీరథ అధికారులు, ఇంజనీర్లు అందరూ షాక్ అయ్యారు. 

ఎమ్మెల్యేలు ఇచ్చిన ఆ షాక్ నుంచి తేరుకున్న తరువాత కడియం శ్రీహరి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పధకం సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నించకుండా, పైఅధికారులకు తప్పుడు సమాచారం అందించేవారిపై కటిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఉన్నతాధికారులు అందరూ తక్షణం క్షేత్రస్థాయిలో పర్యటించి, పనులపురోగతి గురించి తెలుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి కడియం శ్రీహరి  మిషన్ భగీరథ పధకం పూర్తి చేయడానికి నిర్దేశిత గడువులు విధించారు. 

1. గ్రామాలకు నీళ్ళు చేరుకోవలసిన తేదీ: జూలై 15      

2. ఓ.హెచ్.ఎస్.ఆర్.పూర్తి చేయవలసిన తేదీ: సెప్టెంబర్ 15

3. ప్రతీ ఇంటికీ నల్లాలు ఏర్పాటు చేయవలసిన తేదీ: సెప్టెంబర్ 30

4. ట్రయల్ రన్స్: అక్టోబర్ 1 నుంచి 11 వరకు.

5.రోజూ నీటిసరఫరా మొదలుపెట్టాల్సిన తేదీ: అక్టోబర్ 16.

ఈ గడులోపుగానే ప్రతీ జిల్లాలోని విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రభుత్వాసుపత్రులకు, ఇంకా కొత్తగా మంజూరు అవుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళన్నిటికీ కూడా నల్లా కనెక్షన్లు ఏర్పాటుచేసేవిధంగా ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. 


Related Post