టిజెఎస్ లో చేరికలు షురూ?

June 21, 2018


img

తెలంగాణా జనసమితి (టిజెఎస్)ని బలోపేతం చేయడానికి ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం గ్రామాలలో పర్యటిస్తూ తెరాసలో అసంతృప్తిగా ఉన్న నేతలు, కార్యకర్తలను తన పార్టీలోకి ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయన ప్రయత్నాలు ఫలించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వాపురం మండలం మాజీ తెరాస కన్వీనర్ పగడాల కరుణాకర్ రెడ్డి తెరాస ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను తెలంగాణా జనసమితిలో చేరబోతున్నట్లు ప్రకటించారు. తెలంగాణా ఉద్యమాలలో చురుకుగా పాల్గొని, రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత దానిని బలోపేతం చేయడానికి ఎంతగానో కృషి చేసిన తనకు పార్టీలో సముచిత గౌరవం లభించలేదని అన్నారు. తెలంగాణా ఉద్యమాలలో మొహం చాటేసి తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలో చేరిన ఇతరపార్టీల నేతలకు పదవులు పంచిపెడుతూ, తనవంటి ఉద్యమకారులను పట్టించుకోలేదని అందుకే తెరాసను వీడుతున్నానని పగడాల కరుణాకర్ రెడ్డి చెప్పారు. త్వరలోనే తెలంగాణా జనసమితిలో చేరుతానని చెప్పారు. 

తెరాసలో అసంతృప్తితో రగిలిపోతున్న పగడాల కరుణాకర్ రెడ్డి వంటి నేతలు చాలామందే ఉన్నారు. అటువంటి వారిని గుర్తించి పార్టీలో చేర్చుకోవడానికి ప్రొఫెసర్ కోదండరాం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో వారికి తెరాసలో ఎలాగూ టికెట్ లభించే అవకాశం ఉండదు కనుక వారిలో చాలామంది టిజెఎస్ లో చేరే అవకాశాలున్నాయి. అయితే టిజెఎస్ లో చేరి టికెట్ సంపాదించుకున్నప్పటికీ, వారు తెరాస, కాంగ్రెస్ అభ్యర్ధులను డ్డీకొని ఎన్నికలలో గెలవగలరా లేదా? అనే అనుమానం ఉంది. ఎందుకంటే వచ్చే ఎన్నికలలో తెరాస ఎమ్మెల్యేలను బట్టి కాక, తెరాస సర్కార్ పనితీరు ఆధారంగా ప్రజలు ఓట్లేసే అవకాశం ఉంది. అలాగే వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ నేతలకు జీవన్మరణ సమస్య వంటివి కనుక వారు కూడా ఎన్నికలలో గెలిచేందుకు తమ ప్రత్యర్ధులకు గట్టి పోటీనిస్తారు. కనుక తెరాస నేతలు టిజెఎస్ లో చేరినా వచ్చే ఎన్నికలలో నెగ్గడం అంత తేలిక కాదు. అలాగే వారిని పార్టీలోకి రప్పించిన్నంతమాత్రాన్న సగం విజయం సాధించినట్లు టిజెఎస్ సంబరపడటం కూడా అనవసరమే.


Related Post