తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి కొత్త దోస్త్?

June 20, 2018


img

తమిళనాడు రాజకీయాల ప్రత్యేకత ఏమిటంటే ఎంత పెద్ద జాతీయపార్టీ అయినా తప్పనిసరిగా ఏదో ఒక ప్రాంతీయపార్టీతో పొత్తు పెట్టుకోవలసిందే. లేకుంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఇంతకాలం తమిళనాడు అన్నాడిఎంకె, డిఎంకె పార్టీలే అధికారం చలాయిస్తున్నాయి. కనుక కాంగ్రెస్, భాజపాలు ఆ రెంటిలో ఏదో ఒకపార్టీతో పొత్తులు పెట్టుకోక తప్పడంలేదు. ఒక్కోసారి ఆ రెండూ కూడా పొత్తులకు నిరాకరిస్తుంటాయి. అప్పుడు జాతీయ పార్టీల పరిస్థితి అయోమయంగా మారుతుంది. రెండేళ్ళ క్రితం తమిళనాడు శాసనసభ ఎన్నికలలో భాజపాకు అదే పరిస్థితి ఎదురైంది. కానీ ఇప్పుడు తమిళనాడులో ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా నటుడు కమల్ హసన్ స్థాపించిన ‘మక్కల్ నీది మైయ్యం’ పార్టీ కనిపిస్తోంది. అయితే తాను భాజపాతో దోస్తీ చేయబోనని కమల్ హాసన్ ముందే స్పష్టం చేశారు. కనుక కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేసే అవకాశం ఉందని భావించవలసి ఉంటుంది. అది నిజమేనన్నట్లు కమల్ హాసన్ బుధవారం డిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఎన్నికల సంఘంలో ఏదో పనిమీద డిల్లీ వచ్చినప్పుడు రాహుల్ గాంధీని కలిసానని తమ సవేశానికి ఎటువంటి ప్రాధాన్యత లేదని కమల్ హాసన్ చెప్పారు. కానీ వేరెవరినీ కలవకుండా రాహుల్ గాంధీని కలవడమే ఏదో కారణం ఉందని తెలియజేస్తోంది. 

కమల్ హాసన్ సొంత కుంపటి పెట్టుకొని రాజకీయాలలో ప్రవేశించిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. కనుక తన పార్టీ వాస్తవపరిస్థితి ఏమిటో ఆయనకు అర్ధమయ్యే ఉంటుంది. తనకు ఎంత ప్రజాధారణ ఉన్నప్పటికీ, దానిని ఓట్లుగా మార్చుకోవడం అంత సులువుకాదని గ్రహించినట్లే ఉన్నారు. అలాగే రాజకీయ పార్టీని స్థాపించినంత తేలికగా నిర్వహించలేమని గ్రహించినట్లే ఉన్నారు. కనుక కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిద్దపడుతున్నారేమో? అదే నిజమైతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తంతే బూరెల గంపలో పడినట్లే. తమిళనాడులో మంచి ప్రజాధారణ ఉన్న కమల్ హాసన్ వంటి నేత మద్దతు లభిస్తే కాంగ్రెస్ పార్టీకి అంతకంటే ఏమి కావాలి? కనుక ఈ దోస్తీ మరికాస్త బలపడితే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి కొత్త దోస్త్ లభించినట్లే.         



Related Post