అయితే ఉత్తమ్ కి ఉద్వాసన తప్పదా?

June 20, 2018


img

కీలకమైన గత ఎన్నికల సమయంలో తెలంగాణా కాంగ్రెస్ నేతలందరూ కలిసి అప్పుడు పిసిసి అధ్యక్షుడుగా ఉన్న పొన్నాల లక్ష్మయ్యను కుర్చీలో దింపేవరకు నిద్రపోలేదు. ఆయనను దింపినట్లయితే తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోగలమని అధిష్టానానికి నమ్మబలికారు. వారి కోరిక ప్రకారమే అధిష్టానం పొన్నాలను దించి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించింది. టి-కాంగ్రెస్ నేతలు పట్టుపట్టి పొన్నాలను దింపగలిగారు కానీ రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోలేకపోయారు. 

మళ్ళీ ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో టి-కాంగ్రెస్ నేతలు అందరూ డిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసి  ఉత్తమ్ కుమార్ రెడ్డిని అధ్యక్ష పదవి నుంచి దించినట్లయితే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోగలమని గట్టిగా చెప్పివచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, మై హోమ్స్ అధినేత రామేశ్వరరావు ద్వారా సిఎం కెసిఆర్ తో ‘మ్యాచ్ ఫిక్సింగ్’ కి పాలపడుతున్నట్లు సమాచారం ఉందని టి-కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి పిర్యాదు చేశారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి 50 మంది పేర్లతో కూడిన ఒక జాబితాను రాహుల్ గాంధీకి ఇచ్చి వారితో వివిధ కమిటీలను ఏర్పాటు చేయవలసిందిగా కోరితే, టి-కాంగ్రెస్ నేతలు కూడా 40 మంది పేర్లతో కూడిన మరో జాబితాను రాహుల్ గాంధీ చేతిలో పెట్టి వచ్చారు. వారికి అవకాశం కల్పిస్తే వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ విజయానికి గట్టిగా కృషి చేస్తామని చెప్పారు. 

రాహుల్ గాంధీని కలిసినవారిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డికె అరుణ, మల్లు భట్టి విక్రమార్క, తదితరులున్నారు. అయితే తాము ఎవరిపై పిర్యాదు చేయలేదని, రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో మాట్లాడేందుకు ఒక్కరోజు సమయం కేటాయించమని అడిగామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే విధంగా పార్టీని మార్గదర్శనం చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీ వేయాలని కోరామని చెప్పారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడమే తమ లక్ష్యమని వారు చెప్పారు. 

కానీ వారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పదవిలో నుంచి తప్పించడానికే వయు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారని చెప్పవచ్చు. కనుక పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుర్చీ క్రింద మంట మొదలైందనె భావించవచ్చు. మరి అయన నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలకు వెళుతుందా  లేక ఈలోగానే ఆయనను దింపేసి వేరేవారిని కూర్చోబెడతారో చూడాలి. 


Related Post