పిసిసి అధ్యక్ష పదవి కావాలి: సంపత్ కుమార్

June 19, 2018


img

ఈరోజు హైదరాబాద్ గాంధీ భవన్ లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నేతలు చాలా మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. తెరాస సర్కార్ నిర్ణయంతో మీడియా దృష్టిని ఆకర్షిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తనకు 2019 ఎన్నికల తరువాత పిసిసి అధ్యక్ష పదవి చేపట్టాలని ఉందని చెప్పారు. అయన కోరికను మరో సీనియర్ కాంగ్రెస్ నేత మల్లు రవి బలపరచడం విశేషం. కానీ దానర్ధం 2019 ఎన్నికల వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డే పిసిసి అధ్యక్షుడుగా కొనసాగుతారని ఒక విచిత్రమైన బాష్యం చెప్పారు. నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలందరూ విధిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని, ఎవరూ ఆయనను వ్యతిరేకించరాదని కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడో తేల్చి చెప్పింది. కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోనే 2019 ఎన్నికలను ఎదుర్కోబోతోందని స్పష్టమయింది. 

కానీ తనకంటే అనేకమంది సీనియర్లు పిసిసి అధ్యక్ష పదవి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తుంటే, సంపత్ కుమార్ ఆ పదవిని ఆశించడమే విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ నేతల ఈ పదవీలాలస కారణంగానే ఆ పార్టీలో ముఠాలు ఏర్పడి వాటి మద్య కుమ్ములాటలు జరుగుతుంటాయి. ఆ కారణంగానే కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంటుందని అందరికీ తెలుసు. 


Related Post