ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన మంచిర్యాల యువతి

June 19, 2018


img

కర్ణపేట...మంచిర్యాలలోని దండేపల్లి మండలంలో ఓ చిన్న గ్రామం. ఆ గ్రామానికి చెందిన గిరిజన యువతి అజ్మీరా బాబీ. ఈమాత్రం చెప్పుకుంటే ఆమె ఎటువంటి పరిస్థితిలో ఉండవచ్చో అందరూ తేలికగా ఊహించి చెప్పగలరు. కానీ అందరి ఊహలకు అందనంత ఎత్తులో ఆకాశంలో ఆమె విహరిస్తోంది. త్వరలో ఆమె విమాన పైలట్ కాబోతోంది. అవును.. ఇది నిజం! కర్ణపేట నుంచి ఆకాశం వరకు ఆమె ప్రస్తానం ఎలా సాగిందంటే...

ఆమె తల్లితండ్రులు అజ్మీరా హరిరాం నాయక్, జయశ్రీలు ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. వారి కుమార్తె అజ్మీరా బాబీ చిన్నప్పటి నుంచి చదువులలో చురుకుగా ఉండేది. 10వ తరగతి వరకు మంచిర్యాలలోనే చదువుకుంది. ఆ తరువాత హైదరాబాద్ లో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంబిఏ పూర్తి చేసింది. 

ఒకరోజు ఆమె తన మేనత్తకు వీడ్కోలు పలికేందుకు విమానాశ్రయానికి వెళ్ళింది. అప్పుడే ఆమెకు విమానయాన రంగంలో పనిచేయాలనే ఆలోచన కలిగింది. మొదట ఒక విమానయాన సంస్థ ఎయిర్ హోస్టస్ ఉద్యోగాల కోసం ప్రకటన ఇచ్చినపుడు ఆమె దానికి దరఖాస్తు చేసుకోవడం తొలి ప్రయత్నంలోనే ఆ ఉద్యోగానికి ఎంపికకావడంతో ఆమె ఎంచుకున్న మార్గంలో మొదటి అడుగుపడింది.

అయితే ఆమె లక్ష్యం ఏనాటికైనా కమర్షియల్ విమాన పైలట్ కావడం. అందుకు అవసరమైన శిక్షణ కోసం అమెరికాలోని ఫ్లోరిడాలోగల డీన్ ఫ్లయింగ్ స్కూల్ లో చేరింది. ఆమెలో పైలట్ కావాలనే చాలా తపన, పట్టుదల ఉన్నపటికీ, శిక్షణ పొందేందుకు అవసరమైన ఆర్ధికస్తోమత లేకపోవడంతో మధ్యలో వెనక్కు తిరిగి రావలసిన పరిస్థితి ఏర్పడింది. ఆమె తల్లితండ్రులు స్థానిక ఎమ్మెల్యే సహాయంతో సిఎం కెసిఆర్ ను కలిసి అజ్మీరా బాబీ ప్రయత్నాల గురించి చెప్పగా, సిఎం కెసిఆర్ వెంటనే ఆమె శిక్షణకు అవసరమైన రూ.28లక్షలు మంజూరు చేశారు. దీంతో ఆమె శిక్షణ పూర్తిచేసుకుని విమాన పైలట్ కాబోతున్నారు.

ఒక మారుమూల గ్రామానికి చెందిన ఒక గిరిజన యువతి ఇంత పట్టుదలగా అంచెలంచెలుగా ఎదగగలిగినప్పుడు, పట్టణాలు, హైదరాబాద్ నగరంలో ఉండే యువతీయువకులు మాత్రం ఎందుకు ఎదగలేరు? అని అందరూ ఆలోచించాలి. ఆమెను స్పూర్తిగా తీసుకుని పైకి ఎదిగేందుకు కృషిచేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. 


Related Post