జమ్ము కాశ్మీర్ సిఎం మహబూబా ముఫ్తీ రాజీనామా

June 19, 2018


img

జమ్ము కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వంలో తన సంకీర్ణ భాగస్వామి పిడిపికి భాజపా ఊహించని పెద్ద షాక్ ఇచ్చింది. మహబూబా ముఫ్తీ ప్రభుత్వం నుంచి తాము వైదొలగుతున్నట్లు భాజపా అధికార ప్రతినిధి రాం మాధవ్ మంగళవారం మధ్యాహ్నం ప్రకటించారు. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపుచేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో సిఎం మహబూబా ముఫ్తీ పూర్తిగా విఫలమయినందున, తాము ఆమె ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేస్తున్నామని రాం మాధవ్ తెలిపారు. 

భాజపా నిర్ణయంతో మహబూబా ముఫ్తీ ప్రభుత్వం దిగిపోక తప్పలేదు. సిఎం మహబూబా ముఫ్తీ, ఆమె సహచర మంత్రులు రాజీనామాలు చేసి వాటిని గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రాకు పంపించారు. అదేవిధంగా భాజపా మంత్రులు కూడా తమ రాజీనామా లేఖలను గవర్నర్ కు పంపించారు. కనుక జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో మళ్ళీ గవర్నర్ పాలన విధించడం తధ్యంగా కనిపిస్తోంది. 

ఈ సందర్భంగా పిడిపి ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ, “భాజపాతో కలిసి మేము ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించేందుకు చేయగలిగినంతా చేశాము. మూడేళ్ళు మాతో కలిసి పనిచేసిన భాజపా ప్రభుత్వంలో నుంచి వైదొలగుతున్నట్లు కనీసం మాట మాత్రంగానైనా మాకు చెప్పకుండా తప్పుకోవడం మాకు ఆశ్చర్యం కలిగించింది. తాజా పరిస్థితులపై మేము చర్చించుకుని ఏవిధంగా ముందుకు సాగాలో నిర్ణయించుకుంటాము,” అని చెప్పారు.

గత కొంతకాలంగా జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో పరిస్థితులు మళ్ళీ మొదటికొచ్చాయి. ఇటీవల సీనియర్ జర్నలిస్ట్ బుఖారీని ఉగ్రవాదులు పట్టపగలే హత్య చేశారు. ఔరంగజేబ్ అనే జవానును కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చారు. కాశ్మీరులో అల్లరి మూకలు పోలీస్ బలగాలపై రాళ్ళ దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పుతున్నా సిఎం మహబూబా ముఫ్తీ ఏమీ చేయలేని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నారు.

ఈ పరిస్థితులలో ఇంకా పిడిపితో కలిసి కొనసాగితే భాజపాకు కూడా ఆ మరకలు అంటుకుంటాయనే భయంతోనే భాజపా బయటకు వచ్చేసి ఉండవచ్చు. అయితే, జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో పరిస్థితులు అదుపుతప్పడానికి సిఎం మహబూబా ముఫ్తీ ఎంత బాధ్యత ఉందో, కేంద్రానికి కూడా అంతే ఉందని కాంగ్రెస్ వాదిస్తోంది. అదీ నిజమే కదా!


Related Post