బయ్యారంపై కేంద్రం వెనకడుగు ఎందుకు?

June 18, 2018


img

ఖమ్మం జిల్లాలోని బయ్యారం వద్ద ఉక్కు కర్మాగారం నిర్మించడం సాధ్యంకాదని కేంద్రం తేల్చి చెప్పేయడంతో, రాష్ట్ర ప్రభుత్వమే దానిని నిర్మించడానికి సిద్దంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి కేటిఆర్ అన్నారు. దీని గురించి చర్చించేందుకు మంత్రి కేటిఆర్ అధ్యక్షతన నిన్న సమావేశం జరిగింది. దానిలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, “బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాము కానీ కేంద్రం వైఖరి చూస్తే దానికి నిర్మించే ఉద్దేశ్యం లేదని స్పష్టం అవుతోంది. ఎటువంటి బొగ్గు, ఇనుప గనులు లేని విశాఖలో ఉక్కుకర్మాగారం అద్భుతంగా నడుస్తున్నప్పుడు, బొగ్గు, ముడి ఇనుము గనులు అందుబాటులో ఉన్న బయ్యారంలో ఉక్కు కర్మాగారం లాభసాటి కాదంటే నమ్మశక్యంగా లేదు. కనుక దీనిని నిర్మించడానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి గనులు,ఇంధన, పరిశ్రమలు శాఖల ముఖ్యకార్యదర్శులు, సింగరేణి, ఖనిజాభివృద్ధి సంస్థల అధికారులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశాము. నెల రోజులలోపుగా ఈ కమిటీ తన నివేదికను సమర్పించవలసి ఉంటుంది. దాని ఆధారంగా బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది,” అని అన్నారు.    

బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మించడానికి అవసరమైన అన్ని వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ, అక్కడ లభించే ముడి ఇనుము నాణ్యమైనదికాదనే సాకుతో కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. 

కానీ కేంద్రానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే, మంత్రి కేటిఆర్ చెప్పినట్లు ఏ వనరులు లేని విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయగా లేనిది అన్ని వనరులు అందుబాటులో ఉన్న బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కష్టమేమీ కాదు. కానీ తెలంగాణాకు ఎన్ని నిధులు సమకూర్చినా, ఎన్ని సంస్థలు ఏర్పాటు చేసినా, తెలంగాణాలో భాజపా ఎన్నటికీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కనుక రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వెనుకాడుతోందని భావించవలసి ఉంటుంది. అదే..భాజపాకు కంచుకోట వంటి గుజరాత్ రాష్ట్రంలో భారీపరిశ్రమల ఏర్పాటుకు, వేలకోట్లు ఖర్చుతో అంతర్జాతీయ స్థాయిలో ‘డొలేరా’ అనే సరికొత్త నగరం నిర్మాణానికి, అలాగే వేలకోట్లు ఖర్చుతో గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ రైలు ఏర్పాటుకి కేంద్రం వెనుకాడటం లేదు. అంటే భాజపాకు రాజకీయంగా ప్రయోజనం ఉంటేనే ఏ రాష్ట్రంలోనైనా పెట్టుబడుల ప్రవాహం ఉంటుందని స్పష్టం అవుతోంది. ఏపి, తెలంగాణా రాష్ట్రాలలో భాజపాకు ఆ అవకాశం లేదు కనుకనే వెనుకాడుతోందని అనుమానించకతప్పదు. కనుక బయ్యారంలో రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు కర్మాగారం నిర్మించగలిగితే అది రాష్ట్రాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది.


Related Post