మోత్కుపల్లి చుట్టూ ఆయన ఎందుకు తిరుగుతున్నారో?

June 15, 2018


img

మోత్కుపల్లి నరసింహులు తెదేపా నుంచి బహిష్కరించబడిన తరువాత వైకాపా చేతిలో పావుగా మారినట్లు కనిపిస్తున్నారు. వైకాపా ప్రధానకార్యదర్శి విజయసాయి రెడ్డి నిన్న హైదరాబాద్ లో మోత్కుపల్లి నివాసానికి వచ్చి సమావేశం అయ్యారు. ఆ తరువాత మోత్కుపల్లి యధాప్రకారం మళ్ళీ ఏపి సిఎం చంద్రబాబు నాయుడుపై తీవ్రవిమర్శలు చేశారు. 

మోత్కుపల్లి విమర్శలకు టిటిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ ఘాటుగా సమాధానం చెప్పారు. “తెదేపా ద్వారా రాజకీయంగా ఈ స్థాయికి ఎదిగి, ఇప్పుడు కన్నతల్లి వంటి పార్టీని, దాని అధ్యక్షుడినే విమర్శిస్తున్న మోత్కుపల్లి ఒక ద్రోహి. అటువంటి వ్యక్తులు చేసే విమర్శలు, ఆరోపణలకు తెదేపా భయపడబోదు. మోత్కుపల్లి మాటలను, అయన వ్యవహరిస్తున్న తీరును ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఆయనకు వారే తగినవిధంగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు. 

ఏపి రాజకీయాలతో సంబంధం లేని మోత్కుపల్లి చుట్టూ వైకాపా కార్యదర్శి విజయసాయి రెడ్డి తిరుగుతుండటం చూస్తే, చంద్రబాబు నాయుడుపై పగతో రగిలిపోతున్న ఆయనను ఒక అస్త్రంగా ఉపయోగించుకోవచ్చునని భావిస్తునట్లుంది. మోత్కుపల్లి చాలా ఏళ్ళు బాబుతో సన్నిహితంగా పనిచేశారు కనుక బాబు గురించి మరెవరికీ తెలియని విషయాలు ఆయనకు తెలిసి ఉండవచ్చు. కనుక అయన చేత వాటిని బయటపెట్టించగలిగితే ఏపిలో తెదేపా పునాదులు కదిలిపోతాయని జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది.  

అయితే వైకాపా చేతిలో పావుగా మారడం వలన మోత్కుపల్లి పగ చల్లారవచ్చునేమో కానీ రాజకీయంగా ప్రయోజనమేమి ఉండదు. ఒకవేళ అందుకు బహుమానంగా అయన అంగీకరించినట్లయితే తెలంగాణా వైకాపా పగ్గాలు అప్పగించినా ఆశ్చర్యం లేదు. కానీ మోత్కుపల్లి అందుకు అంగీకరించకపోవచ్చు కనుక బాబుపై విమర్శలు గుప్పిస్తూ కాలక్షేపం చేయడం వలన ఆయనకు కొత్తగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. 


Related Post