బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ లో నకిలీనోట్లు!!!

June 15, 2018


img

ఆ మధ్యన ఒక ఉత్తరాది రాష్ట్రంలో ఎస్.బి.ఐ. ఎటిఎం నుంచి నకిలీ రూ.500 నోట్లు రావడం కలకలం సృష్టించింది. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో బ్యాంకుల నుంచి రిజర్వ్ బ్యాంక్ కు రూ.26 లక్షలు విలువగల నకిలీనోట్లు చేరడంతో ఆర్.బి.ఐ. షాక్ అయ్యింది. అంటే రెండు రాష్ట్రాలలో మార్కెట్లలో నకిలీ నోట్లు ఏ స్థాయిలో చలామణిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. 

ఇదివరకు చాలా దశాబ్దాలుగా పాతనోట్లు చలామణిలో ఉన్నందున వాటిలో అసలు, నకిలీ నోట్లను సామాన్య ప్రజలు సైతం తేలికగానే గుర్తుపట్టగలిగేవారు. కానీ ఇప్పుడు వేర్వేరు రంగులతో కొత్తనోట్లు చలామణిలోకి రావడంతో వాటిలో అసలు ఏవో, నకిలీ నోట్లు ఏవో తెలుసుకోవడం కష్టంగా ఉంది. ఇప్పుడు అత్యాధునిక ప్రింటింగ్ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. కనుక ఇదే అదునుగా నకిలీనోట్లు తయారుచేసే ముఠాలు రెచ్చిపోతున్నాయి. 

కొత్తగా ప్రవేశపెట్టిన రూ.500, 2,000 నోట్లు అత్యున్నత భద్రతాప్రమాణాలతో ముద్రిస్తున్నామని, వాటికి నకిలీలు సృష్టించడం దాదాపు అసాధ్యమని రిజర్వ్ బ్యాంక్, కేంద్రప్రభుత్వం బల్లగుద్ది వాదిస్తున్నాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో బ్యాంకుల నుంచి రిజర్వ్ బ్యాంక్ కు రూ.26 లక్షలు విలువగల నకిలీనోట్లు చేరాయంటే బ్యాంకు సిబ్బంది కూడా గుర్తించలేనంత చక్కగా నకిలీనోట్లు ముద్రణ సాగుతోందని స్పష్టం అవుతోంది. బ్యాంక్ సిబ్బందే నకిలీ నోట్లను గుర్తించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అవే నోట్లు ఎటిఎంల ద్వారా బయటకు వస్తాయి. కనుక అవే మార్కెట్లలో చలామణి అవుతుంటాయి. 

రెండేళ్ళ క్రితం పాత పెద్దనోట్లను రద్దుచేసినప్పుడు, అప్పటికి దేశంలో చలామణిలో ఉన్న నకిలీనోట్లను అరికట్టడం ద్వారా భారతదేశ ఆర్దికవ్యవస్థను పటిష్టపరుస్తున్నామని కేంద్రప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. కానీ ఇప్పుడు సాధారణ బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ లలోకే నకిలీ నోట్లు వచ్చి చేరిపోతున్నాయని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. నకిలీ నోట్ల చలామణి ఇదేవిధంగా ఇంకా కొనసాగితే ఏదో ఒకరోజు భారత ఆర్ధికవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది.


Related Post