మోడీ-కెసిఆర్ సమావేశం సమాప్తం

June 15, 2018


img

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు మధ్యాహ్నం సుమారు 50 నిమిషాలసేపు సమావేశం అయ్యారు. ఈసారి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ఎంపిలి జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, కేశవరావు తదితరులు కూడా హాజరయ్యారు. 

తెలంగాణా ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం, ముస్లింలకు రిజర్వేషన్ల పెంపు, హైకోర్టు విభజన, డిల్లీలోని ఏపి భవన్ విభజన మొదలైన అంశాలను సిఎం కెసిఆర్ ప్రధాని మోడీదృష్టికి తీసుకువెళ్ళారు. సిఎం కెసిఆర్ మొత్తం 68 అంశాలకు సంబందించిన వివరాలతో కూడిన ఒక ఫైలును ప్రధాని నరేంద్రమోడీకి అందజేసి వాటిని పరిష్కరించవలసిందిగా కోరినట్లు సమాచారం. 

అయితే సిఎం కెసిఆర్, తెరాస ఎంపిలు, రాష్ట్ర ఉన్నతాధికారులు గత నాలుగేళ్ళుగా వాటి గురించి ప్రధాని నరేంద్రమోడీతో సహా కేంద్రమంత్రులకు గుర్తుచేసి పరిష్కరించవలసిందిగా కోరుతూనే ఉన్నారు. కానీ నేటికీ వాటిలో అనేక సమస్యలు నేటికీ అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. హైకోర్టు విభజన, ముస్లిం రిజర్వేషన్లు బిల్లు అందుకు చక్కటి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. కనుక ఇప్పుడు సిఎం కెసిఆర్ మళ్ళీ వాటన్నిటినీ ప్రధాని నరేంద్రమోడీకి ఏకరువు పెట్టినప్పటికీ అయన వాటిని పట్టించుకుంటారని ఆశిస్తే అది అత్యాశే అవుతుంది.


Related Post