కాంగ్రెస్, భాజపాలలో కెసిఆర్ ఛాయిస్ ఏమిటో?

June 14, 2018


img

“ప్రధాని నరేంద్రమోడీ కనుసన్నలలో సిఎం కెసిఆర్ పని చేస్తున్నారు. అయన కనుసన్నలలో ఓవైసీలు పనిచేస్తున్నారు. కెసిఆర్, ఓవైసీలు కలిసి వచ్చే ఎన్నికలలో భాజపా వ్యతిరేకశక్తుల మద్య చీలికలు సృష్టించి, భాజపాను ఒడ్డున పడేయడానికే ఫెడరల్ ఫ్రంట్ డ్రామా మొదలుపెట్టారు,” అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు. 

కెసిఆర్ రాహుల్ గాంధీతో కంటే ప్రధాని నరేంద్రమోడీతో సఖ్యతగా ఉండటానికే ఇష్టపడుతున్నట్లు అయన మాటలు, చర్యల ద్వారా స్పష్టం అవుతోంది. అందుకే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ ఆవిధంగా ఆరోపణలు చేస్తోంది.  

అయితే కర్ణాటకలో సిఎం కెసిఆర్ అందుకు పూర్తి విరుద్దంగా వ్యవహరించారు. అయన జెడిఎస్ కు మద్దతు పలికారు. అది కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిసినా అయన బెంగళూరు వెళ్ళి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న కుమారస్వామిని అభినందించి వచ్చారు. అంటే ఫెడరల్ ఫ్రంట్ భాగస్వాములు కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేసినా అభ్యంతరం లేదని చెప్పినట్లయింది.  

కెసిఆర్ తో దోస్తీ చేయాలనుకొంటున్న పార్టీలు లేదా అయన దోస్తీ చేయాలనుకొంటున్న పార్టీలలో చాలా వరకు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికే మొగ్గు చూపుతున్నాయి. కనుక కెసిఆర్ కూడా వాటి బాటలోనే నడువక తప్పదు. కానీ తెలంగాణా విషయానికి వచ్చేసరికి అయన నేటికీ కాంగ్రెస్ పార్టీని దరిచేరనీయలేదు. కాంగ్రెస్-తెరాసలు బద్ధశత్రువులుగానే వ్యవహరిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో ఆ రెండు పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉండబోతోందని ఇప్పటికే స్పష్టమైంది. అంటే రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీతో దోస్తీకి తెరాస సిద్దంగా లేదని భావించవచ్చు. 

సిఎం కెసిఆర్ ఆ రెండు పార్టీలలో తాను దేనివైపు మొగ్గు చూపుతున్నారో దేనిని వ్యతిరేకిస్తున్నారో వాటికి సైతం అర్ధం కానీయకుండా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. తద్వారా రెండు జాతీయపార్టీలను సమానదూరంలో ఉంచుతూనే వాటికి తన అవసరం అర్ధమయ్యేలా చేస్తున్నారని చెప్పవచ్చు. కానీ అవసరమైతే వాటిలో ఏదో ఒకదానికి మద్దతు ఈయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే నిజమనుకుంటే కెసిఆర్ ఇక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయవలసిన అవసరమే ఉండదేమో?


Related Post