అయితే డిఎస్ ను తెరాస పక్కన పెట్టేసినట్లేనా?

June 14, 2018


img

ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు ప్రజలందరినీ ఒకేగాట కట్టి మాట్లాడితే కుదర్దు. కులాలు, మతాలు, తెగలవారీగా ‘ప్రత్యేకంగా’ మాట్లాడితేనే ఏమైనా ఫలితం కనిపిస్తుంది. తెరాస ప్రస్తుతం అదే పనిలో ఉంది. నిజామాబాద్ జిల్లాలో బలమైన సామాజికవర్గమైన మున్నూరుకాపులను ప్రసన్నం చేసుకునేందుకు తెరాస ఎంపి కవిత బుధవారం తన కార్యాలయంలో మున్నూరు కాపుకులస్థుల పెద్దలతో సమావేశమయ్యి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లా స్థాయిలో సంఘలాను ఏర్పారచుకున్నట్లయితే, వాటి ద్వారా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చునని ఆమె సూచించారు. వచ్చే ఎన్నికలలో తెరాసకు వారి మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు/. ఈ సమావేశంలో ఆమె వారికి ఏమి హామీలు ఇచ్చారో తెలియదు కానీ వారు సమావేశం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 

నిజామాబాద్ లో ఆ వర్గానికి చెందిన నేత డి.శ్రీనివాస్ ప్రస్తుతం తెరాసలోనే ఉన్నారు. అయితే తెరాసలో ఆయనకు, అయన అనుచరులకు తగిన గుర్తింపు, గౌరవం లభించడంలేదనే బాధతో ఆయన గత కొంతకాలంగా తెరాస కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అదే కారణం చేత ఆయన కుమారుడు అరవింద్ భాజపాలో చేరిపోయారు. వచ్చే ఎన్నికలలో నిజామాబాద్ నుంచి లోక్ సభకు పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకొంటున్నారు. అంటే కవితపై పోటీకి సిద్దం అవుతున్నారన్న మాట! ఆ ప్రయత్నాలలో భాగంగా అయన నియోజకవర్గంలోని మున్నూరు కాపులను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు కూడా. బహుశః అందుకే కవిత కూడా మున్నూరు కాపు పెద్దలతో సమావేశం అయ్యుండవచ్చు. అంటే డి.శ్రీనివాస్ ను తెరాస ఇక పూర్తిగా పక్కన పెట్టేసినట్లేనా? అయితే అయన ఇంకా తెరాసలోనే కొనసాగుతారా లేక మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారా లేదా కొడుకు కోసం భాజపాలో చేరిపోతారా? చూడాలి.


Related Post