కేజ్రీవాల్ ప్రభుత్వంతో కేంద్రం చెలగాటం

June 14, 2018


img

డిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ తన ముగ్గురు మంత్రులతో కలిసి గత నాలుగు రోజులుగా డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అధికారిక నివాసం ‘రాజ్ నివాస్’ ధర్నా చేస్తున్నారు. తన ప్రభుత్వానికి గత నాలుగు నెలలుగా సహాయ నిరాకరణ చేస్తున్న ఐఏఎస్ అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు రాజ్ నివాస్ లో ధర్నా చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి, మంత్రులు ఆ రాష్ట్ర గవర్నర్ నివాసంలో ధర్నా చేయడం దేశచరిత్రలో ఇదే మొదటిసారి. కానీ వారిని గవర్నర్ అనిల్ బైజల్ పట్టించుకోకపోవడం విస్మయం కలిగుస్తుంది.  

నాలుగు రోజులైనా గవర్నర్ స్పందించకపోవడంతో, సిఎం అరవింద్ కేజ్రీవాల్ అయన మంత్రుల పరిస్థితి అయోమయంగా మారింది. చివరి ప్రయత్నంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్రమోడీకి ఈరోజు ఒక లేఖ వ్రాశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. 

ప్రధాని నరేంద్రమోడీతో సహా కేంద్రమంత్రులు అందరూ నిత్యం ప్రతిపక్షాలకు ఏవో నీతులు చెపుతూనే ఉంటారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ డిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అయన ప్రభుత్వాన్ని కేంద్రప్రభుత్వం ఏదోవిధంగా ఇబ్బందిపెడుతూనే ఉంది. పేరుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అన్ని అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే ఉన్నందున కేజ్రీవాల్ ప్రభుత్వం చేతులు కట్టేసినట్లయింది. ఆ కారణంగా డిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సేవలు అందించలేకపోతోంది. ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రభుత్వంపై కేంద్రం ఈవిధంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడటం చాలా దారుణం. అయితే కేంద్రాన్ని ఎదుర్కోవడానికి అరవింద్ కేజ్రీవాల్ ఎంచుకుంటున్న ఇటువంటి వినూత్నమైన నిరసన పద్దతుల వలన అయనకే ఎక్కువ చెడ్డపేరు వస్తోంది. బహుశః అందుకే కేంద్రం కూడా నిర్లిప్త ధోరణితో వ్యవహరిస్తోందని భావించవలసి ఉంటుంది.


Related Post