వైకాపా చేతిలో మోత్కుపల్లి

June 14, 2018


img

మోత్కుపల్లి నరసింహులు తెదేపాలో ఉన్నప్పుడే కొన్ని తప్పటడుగులు వేశారు. బహిష్కరణకు గురైన తరువాత కూడా ఇంకా వేస్తూనే ఉన్నారు. తన రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించుకోవలసిన ఈ తరుణంలో తనకు సంబంధలేని తెదేపా-వైకాపాల గొడవలలో తలదూరుస్తున్నారు. ఏపిలో తెదేపా సర్కార్ తో ఘర్షణ పడుతున్న కాపునేత ముద్రగడ పద్మనాభంతో ఆయన భేటీ అయ్యారు. ఆ తరువాత వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డితో సమావేశం అయ్యారు. వారిద్దరితో సమావేశం అయిన తరువాత చంద్రబాబు నాయుడుపై మళ్ళీ విమర్శలు గుప్పించారు. 

తనను పార్టీ నుంచి బహిష్కరించినందుకు ఆయనకు చంద్రబాబుపై ఆగ్రహం ఉండవచ్చు. అయితే ఆ కారణంతో తనకు సంబందంలేని ఏపి రాజకీయాలలో వేలుపెట్టడం వలన ఏమి ప్రయోజనం అని ఆలోచిస్తే, బాబుపై ప్రతీకారం తీర్చుకోవడం తప్ప మరే ప్రయోజనమూ ఉండదని అర్ధమవుతుంది. 

మోత్కుపల్లి, ముద్రగడ వంటివారి సహకారంతో బాబును రాజకీయంగా దెబ్బ తీయగలిగితే వైకాపాకు లాభం కలుగుతుంది కానీ వారికి ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. మరొక ఏడాదిలో ఎన్నికలు ముంచుకొస్తున్నప్పుడు మోత్కుపల్లి తన రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించుకుంటే మంచిది కదా?            



Related Post