రాజకీయాలకు తిరుమల అతీతం కాదా?

June 14, 2018


img

కోట్లాదిమంది హిందువులకు ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారిని కూడా మన రాజకీయ నాయకులు విడిచిపెట్టడం లేదు. తిరుమల కేంద్రంగా తెదేపా-భాజపా-వైకాపాలు రాజకీయాలు చేస్తుండటంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు కొన్ని లోపాలను ఎత్తి చూపడంతో మొదలైన వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు చేరుకొంది. 

స్వామివారికి ఆగమశాస్త్రం ప్రకారం ధూపదీపనైవేద్యాలు జరుగడంలేదని, స్వామివారికి మైసూర్ మహారాజావారు బహుకరించిన హారంలో ఒక వజ్రం దొంగతనం అయినా టిటిడి పట్టించుకోలేదని, లడ్డూలు తయారీ చేసే ‘పోటు’ భవనంలో గుప్తనిధులు ఉన్నాయనే అనుమానంతో త్రవ్వకాలు జరిపారంటూ రమణ దీక్షితులు అనేక తీవ్ర ఆరోపణలు చేశారు. 

దీంతో ఏపి సర్కార్ కు...అది ఏర్పాటు చేసిన టిటిడి బోర్డుకు సహజంగానే ఆగ్రహం కలిగింది. వెంటనే రమణ దీక్షితులను నిర్బందంగా పదవీ విరమణ చేయించారు. అయన భాజపా, వైకాపాల ప్రోత్సాహంతోనే అటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ప్రతివిమర్శలు చేశారు. అయన హైదరాబాద్ వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలవడం, ఆయనకు వైకాపా, భాజపా నేతలు మద్దతు పలకడం వాటి ఆరోపణలను దృవీకరిస్తున్నట్లయింది. అయితే అయన చేస్తున్న ఆరోపణలను ఏపి సర్కార్, టిటిడి ఖండిస్తున్నాయే తప్ప నిజానిజాలను తేల్చేందుకు విచారణకు ఆదేశించడానికి అంగీకరించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.  

గత నెలరోజులుగా ఆయనకు, వైకాపా, భాజపాలకు-టిటిడి,తెదేపా మద్య జరుగుతున్న ఈ యుద్ధం తిరుమల ప్రతిష్టకు భంగం కలిగిస్తోందని తెలిసినా ఎవరూ వెనక్కు తగ్గకపోవడం చాలా శోచనీయం. టిటిడిపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు సంజాయిషీ కోరుతూ ఆయనకు, వైకాపా ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి నోటీసులు పంపించింది. 

ఈ వ్యవహారంపై తాను సుప్రీంకోర్టుకు వెళతానని రమణ దీక్షితులు హెచ్చరించడంతో, అయన స్థానంలో కొత్తగా ఆలయ ప్రధానఅర్చకులుగా నియమింపబడిన వేణుగోపాల్ దీక్షితులు బుధవారం సుప్రీంకోర్టులో కేవిఎట్ పిటిషన్ వేశారు. తన నియామకాన్ని సవాలు చేస్తూ ఎవరైనా పిటిషన్ వేసినట్లయితే ముందుగా తమకు తెలియజేయకుండా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయరాదని ఆ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టును కోరారు. 

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెదేపా, వైకాపా, భాజపా మూడు పార్టీలు కూడా ఈ అంశంపై రాజకీయాలు చేస్తూ పైచెయ్యి సాధించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఆలయ పవిత్రతను, ప్రతిష్టను కాపాడుతూ దానిని మరింత ఇనుమడింపజేయవలసిన టిటిడి బోర్డు కూడా ఈ రాజకీయాలకు కేంద్రంగా మారడం చాలా బాధాకరం. ఈవిధంగా అందరూ కలిసి ఆలయపవిత్రతకు, ప్రతిష్టకు భంగం కలిగేవిధంగా ప్రవర్తిస్తుండటం చూసి వెంకన్న భక్తులు చాలా బాధపడుతున్నారు. కానీ ఆ వెంకన్ననే పట్టించుకోనప్పుడు ఇక భక్తుల గోడు ఎవరు వింటారు?


Related Post