ఛత్తీస్ ఘడ్ విద్యుత్ వద్దు

June 13, 2018


img

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నుంచి 1,000 మెగావాట్స్ విద్యుత్ కొనుగోలుకు 2014, నవంబర్ 3న ఒప్పందం జరిగింది. ఆ తరువాత 2015, సెప్టెంబర్ 22న రెండు రాష్ట్రాల డిస్కంలు ఒప్పందం ఖరారు చేసుకున్నాయి. దాని ప్రకారం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం తెలంగాణా రాష్ట్రానికి 12 ఏళ్ళ పాటు విద్యుత్ సరఫరా చేయవలసి ఉంటుంది. యూనిట్ కు రూ.3.90 ధర  నిర్ణయించుకున్నాయి. ఆ ధరతోనే ఇంతవరకు విద్యుత్ సరఫరా చేస్తోంది. కానీ విద్యుత్ ఉత్పత్తిలో పెరుగుతున్న భారానికి అనుగుణంగా యూనిట్ ధరను రూ.4.70 కు పెంచాలని ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఈ.ఆర్.సి.లో పిటిషన్ వేసింది. దానిపై ఈ.ఆర్.సి. ఇంకా నిర్ణయం తీసుకొనవలసి ఉంది. కానీ ఆ ప్రతిపాదనకు ఆమోదం లభించినట్లయితే తెలంగాణా ప్రభుత్వంపై చాలా భారం పడుతుంది. అయితే బయట అంత కంటే తక్కువ ధరకే విద్యుత్ లభిస్తున్నప్పుడు అంత ధర చెల్లించి ఛత్తీస్ ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయనవసరంలేదని తెరాస సర్కార్ భావిస్తోంది.

ఈ ఏడాది జూలై 16 నుంచి సెప్టెంబర్ 30వరకు రోజూ పగటి వేళల్లో 12 గంటలపాటు విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన విద్యుత్ ను కంపిటిటివ్ బిడ్డింగ్ టెండర్ల ద్వారా ఓపెన్ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీనికోసం దక్షిణ తెలంగాణా విద్యుత్ పంపిణీ సంస్థ టెండర్లను కూడా ఆహ్వానించింది. ఇక  త్వరలో పూర్తికాబోతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అధనంగా అవసరమయ్యే మరో 1,000 మెగావాట్స్ విద్యుత్ ను కూడా ఇదే పద్దతిలో ఓపెన్ మార్కెట్ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు ట్రాన్స్-కో సిఎండి డి ప్రభాకర్ రావు తెలిపారు. ఇక నుంచి రాష్ట్రానికి అధనంగా అవసరమయ్యే విద్యుత్ ను ఈ పద్దతిలోనె కొనుగోలు చేయాలనుకొంటున్నామని ప్రభాకర్ రావు తెలిపారు.

ఒకవేళ చత్తిస్ ఘడ్ తో చేసుకున్న ఒప్పందం కారణంగా తప్పనిసరిగా 12 ఏళ్ళపాటు ఆ రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేయవలసివస్తే అది తెలంగాణా ప్రభుత్వానికి గుదిబండగా మారే ప్రమాదం ఉంది. కనుక ఆ ఒప్పందాన్ని తెరాస సర్కార్ కొనసాగిస్తుందో  లేదో తెలియవలసి ఉంది.


Related Post