టీఎస్ఆర్టీసి నాలుగుముక్కలు కాబోతోందా?

June 11, 2018


img

ఆర్టీసి కార్మికులకు 16 శాతం తాత్కాలిక భృతి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మె విరమణ జరిగింది. ఇక ఆర్టీసిని లాభాలబాట పట్టించేందుకు అవసరమైన చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. దానిలో భాగంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఆర్టీసిలు అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

ఆ రెండు రాష్ట్రాలలో కూడా ఇటువంటి సమస్యే ఎదుర్కొన్నప్పుడు, అక్కడి ప్రభుత్వాలు కర్ణాటక ఆర్టీసిని 4 వేర్వేరు సంస్థలుగా, తమిళనాడు ఆర్టీసిని 7 సంస్థలుగా విడదీశాయి. తెలంగాణాలో కూడా ఆర్టీసిని 4 వేర్వేరు సంస్థలుగా ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. 

దాని ప్రకారం జి.హెచ్.ఎం.సి. పరిధిలో ఒకటి, అవిభాజ్య రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలో ఒకటి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు కలిపి ఒకటి, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు కలిపి మరొకటి ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తాజా సమాచారం. ఆవిధంగా చేసినట్లయితే ఆయా జిల్లాలలోని పరిస్థితులు, రవాణా అవసరాలు, రాబడిని బట్టి ఆర్టీసి విధివిధానాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నష్టాలను తగ్గంచుకోవచ్చునని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 

ప్రస్తుతం ఆర్టీసికి రూ.3,000 కోట్లు అప్పులు, వాటిపై ఏటా రూ.250 కోట్లు వడ్డీ చెల్లిస్తోంది. అదిగాక ప్రతీ ఏటా కొత్తగా సుమారు రూ.700 కోట్లు వరకు అప్పు పెరుగుతోందని ప్రభుత్వం చెపుతోంది. తాజాగా పెంచిన 16 శాతం తాత్కాలిక భృతితో ఆర్టీసిపై ప్రతీనెల 16 కోట్లు అధనపు ఆర్ధికభారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. కనుక ఈ నష్టాలను తగ్గించుకునేందుకు ఆర్టీసిని విభజించడమే ఏకైక మార్గమని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 

అయితే ఆర్టీసి సమస్యలకు శాశ్విత ప్రాతిపదికన పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వం త్వరలోనే ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయబోతోంది. అది లోతుగా అధ్యయనం చేసిన తరువాతే  ఏ నిర్ణయమైనా అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ ప్రభుత్వం ఆర్టీసిని నాలుగు భాగాలుగా విభజించాలనుకుంటే మరి ఆర్టీసి కార్మికులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.


Related Post