తెరాసకు ముందు నుయ్యి వెనుక పొయ్యి?

June 11, 2018


img

తెలంగాణా కాంగ్రెస్ శాసనసభాపక్షనేత కె జానారెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు సోమవారం ఉదయం 11 గంటలకు శాసనసభ స్పీకర్ మధుసూధనాచారిని కలువనున్నారు. హైకోర్టు ఆదేశాలను మన్నించి తమ ఇద్దరు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వం తక్షణం పునరుద్దరించాలని వినతిపత్రం ఇవ్వబోతున్నారు. ఒకవేళ అయన సానుకూలంగా స్పందించకపోతే మొదట ఖమ్మం, ఆలంపూర్ లలో 24 గంటలపాటు నిరసన దీక్షలు, ఆ తరువాత బహిరంగసభలు నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత హైకోర్టులో మళ్ళీ దీనిపై పిటిషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి దీని గురించి ఆయనకు కూడా పిర్యాదు చేస్తామని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 

ఈ వ్యవహారంలో తెరాస సర్కార్ ఇప్పటికే హైకోర్టులో ఎదురుదెబ్బలు తిన్నందున వెనక్కు తగ్గి ఈ సమస్యను ఇక్కడితో ముగించవచ్చు. కానీ ఆవిధంగా చేస్తే తెరాస సర్కార్ తన ఓటమిని, తప్పును అంగీకరించినట్లు అవుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గొప్పగా ప్రచారం చేసుకోకుండా ఉండదు. 

ఒకవేళ స్పీకర్ దీనిపై ఏ నిర్ణయమూ తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రజలలోకి వెళుతుంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల సానుభూతి సంపాదించుకోవడానికి అవకాశం కలుగుతుంది. దీనిపై న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తుంది. కనుక న్యాయస్థానంలో ఇబ్బంది పెట్టే అవకాశం కూడా దానికి లభిస్తుంది. ఈ వ్యవహారం గురించి రాష్ట్రపతిని కలిసేందుకు టి-కాంగ్రెస్ నేతలు డిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ జాతీయమీడియాతో దీనిగురించి మాట్లాడకుండా ఉండరు. 2019 ఎన్నికల తరువాత కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ తో జాతీయరాజకీయాలలో ప్రవేశించాలనుకొంటున్న తరుణంలో అయన గురించి జాతీయస్థాయిలో ‘నెగెటివ్ వార్తలు’ వస్తే మంచిది కాదు. కనుక స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలను స్పీకర్ తక్షణం పునరుద్దరించినట్లయితే, కాంగ్రెస్ పార్టీ దీని గురించి ఎక్కువరోజులు చెప్పుకొనే అవకాశం ఉండదు. కనుక తెరాస సర్కార్ ఈ సమస్య నుంచి తక్కువ నష్టంతో బయటపడవచ్చు. కనుక ఈ సమస్యకు ఇక్కడితో ముగింపు పలకడమే మంచిది.


Related Post