పాక్ ఎన్నికలలో ఉగ్రవాద సంస్థ పోటీ

June 09, 2018


img

జూలై 25న పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిలో లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదసంస్థకు అనుబంధసంస్థ, ముంబై ప్రేలుళ్ళ సూత్రధారి అయిన జమ్మత్-ఉద్-దవా అధినేత హఫీజ్ సయీద్ స్థాపించిన మిల్లి ముస్లిం లీగ్ పోటీ చేస్తోంది. అయితే పాక్ ప్రభుత్వం ఒత్తిడి కారణంగా ఆ సంస్థను ఎన్నికల సంఘం గుర్తించకపోవడంతో, ‘భావ స్వారూప్యత’ కలిగిన అల్లాః-ఓ-అక్బర్-తరీక్ అనే సంస్థతో ఎన్నికల పొత్తులు కుదుర్చుకొని ఏకంగా 200 మంది అభ్యర్ధులను బరిలో దించుతోంది. వారి తరపున మిల్లి ముస్లిం లీగ్ ఎన్నికల ప్రచారం చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షుడు సైఫుల్లా ఖాలిద్ చెప్పారు. దేశభక్తి కలిగి మంచి విద్యావంతులైన యువతకు తాము టికెట్లు ఇస్తామని చెప్పారు. అయితే ఈ ఎన్నికలలో హఫీజ్ సయీద్ మాత్రం పోటీ చేయరని చెప్పారు.

పాకిస్తాన్ లో దేశభక్తి అంటే భారత్, అమెరికా దేశాలను ద్వేషించడమేనని వేరే చెప్పనవసరం లేదు. కనుక 200 మంది ‘దేశభక్తులను’ పాక్ పార్లమెంటులో ప్రతిష్టించగలిగితే కరడు గట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ చేతికి పాక్ పగ్గాలు వస్తాయి. దానితోపాటే పాక్ లో గుట్టలుగుట్టలుగా పేరుకుపోయిన అణ్వాయుధాలు కూడా అతని చేతిలోకి వస్తాయి. హఫీజ్ సయీద్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, భారత్, ఇజ్రాయిల్ దేశాలను ముక్కముక్కలుగా చేసి ఇస్లాం మతాన్ని వ్యాపింపజేయడమే తన లక్ష్యమని ప్రకటించాడు. 

ఒకవేళ అతను పాక్ ఎన్నికలలో గెలిచి పాక్ ప్రభుత్వ పగ్గాలు చేపడితే అప్పుడు అతను మొట్టమొదట భారత్ పైనే దాడి చేస్తాడని వేరే చెప్పనక్కరలేదు. కనుక ఈసారి జరుగబోయే పాక్ ఎన్నికలు భారత్ కు పెద్ద సవాలు విసురుతున్నట్లే భావించవచ్చు.   



Related Post