సిఎం వ్యాఖ్యలే ప్రతిష్టంభనకు కారణమా?

June 09, 2018


img

ఆర్టీసి గుర్తింపు కార్మిక సంఘం టి.ఎం.యు నేతలు ఈరోజు మళ్ళీ రవాణామంత్రి మహేందర్ రెడ్డితో మరోమారు సమావేశం కానున్నారు. కానీ అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘం నేతలు తమ వైఖరికే కట్టుబడి ఉన్నందున చర్చలు ఫలించే సూచనలు కనిపించడం లేదు. కనుక రేపు అర్ధరాత్రి నుంచి ఆర్టీసి సమ్మె అనివార్యంగా కనిపిస్తోంది. 

“యూనియన్ ఎన్నికలలో మళ్ళీ గెలిచేందుకే టి.ఎం.యు నేతలు సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మెలో పాల్గొనే ఆర్టీసి ఉద్యోగులను ఉద్యోగాలలో నుంచి తొలగిస్తాం. ఒకవేళ సమ్మె చేసినట్లయితే ఆర్టీసి చరిత్రలో ఇదే చిట్టచివరి సమ్మె అవుతుంది ఎందుకంటే ఆ తరువాత ఆర్టీసి శాస్వితంగా మూతబడుతుంది,” అని సిఎం కెసిఆర్ అన్నారు. 

కార్మిక సంఘం నేతలను ఉద్దేశ్యించి సిఎం కెసిఆర్ చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలు వారి అహాన్ని దెబ్బతీసి వారిని ఇంకా బిగుసుకుపోయేలా చేశాయని చెప్పవచ్చు. సిఎం కెసిఆర్ వ్యాఖ్యలను ఆర్టీసి కార్మికులతో పాటు ప్రతిపక్షాలు కూడా తప్పు పడుతున్నాయి. ఈ నేపధ్యంలో రవాణామంత్రి మహేందర్ రెడ్డి సిఎం కెసిఆర్ వ్యాఖ్యల తీవ్రతను తగ్గించేవిధంగా ‘ఆయన ఉద్దేశ్యం అది కాదు’ అంటూ ఏదో చెప్పినా ఆర్టీసి సంఘం నేతలు అయన వాదనను అంగీకరించలేదు. 

టి-కాంగ్రెస్ ఆర్టీసి కార్మికులకు నిన్ననే సంఘీభావం తెలిపింది కనుక నేడు కార్మిక సంఘం నేతలు టి-కాంగ్రెస్ నేతలను కలిసి సమ్మెకు మద్దతు కోరబోతున్నారు. రాష్ట్రంలో తెలంగాణా జనసమితి (టిజెఎస్), వామపక్షాలు కూడా ఆర్టీసి కార్మికులకు సంఘీభావం తెలిపాయి. ఈ నేపధ్యంలో నేడు చివరి ప్రయత్నంగా మళ్ళీ చర్చలు జరుగబోతున్నాయి. ఒకవేళ అవి ఫలించకపోతే రేపు అర్ధరాత్రి నుంచి ఆర్టీసి సమ్మె మొదలవుతుంది. కనుక ఉద్యోగులు, దూరప్రాంతాలకు వెళ్ళేవారు ఈవిషయాన్ని గుర్తుంచుకుని తగిన ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.


Related Post