ఆర్టీసి నష్టాలకు వారిద్దరే బాధ్యత వహించాలి: కాంగ్రెస్

June 08, 2018


img

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ఆర్టీసి కార్మికులకు సంఘీభావం ప్రకటించింది. శుక్రవారం కె జానారెడ్డి నివాసంలో జరిగిన సిఎల్.పి. సమావేశంలో ఆర్టీసి కార్మికుల సమ్మె- దానిపై ముఖ్యమంత్రి స్పందన గురించి సుదీర్గంగా చర్చించారు. అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణా రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాలలో పాల్గొన్న ఆర్టీసి కార్మికుల గురించి ఒక ఉద్యమనేత కెసిఆర్ అంత చులకనగా మాట్లాడటం సరికాదు. సమ్మె చేస్తే ఉద్యోగాలలో నుంచి పీకేస్తామని అనడం అయన అహంకారానికి నిదర్శనం. వాస్తవానికి తెరాస సర్కార్ విధానపరమైన లోపాల కారణంగానే ఆర్టీసి నష్టాల ఊబిలో చిక్కుకుపోయింది. కనుక ఆర్టీసి నష్టాలకు కార్మికులను బాధ్యులను చేయడం సరికాదు. రవాణామంత్రిని, ఆర్టీసి చైర్మన్ ను దానికి బాధ్యులుగా చేయాలి. ఆర్టీసి కార్మికుల డిమాండ్లు న్యాయసమ్మతమైనవేనని మేము భావిస్తున్నాము. కనుక వారికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోంది,” అని అన్నారు. 

ఆర్టీసి కార్మిక సంఘాలు జీతాలు పెంచమని అడిగినప్పుడల్లా రెండు మాటలు తప్పక వినిపిస్తుంటాయి. 1. ఆర్టీసి నష్టాలలో ఉంది. 2. దానికి ఎవరు కారకులు అనే ప్రశ్న. 

ఆర్టీసి నష్టాలకు గల కారణాలు సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు చెప్పగలుగుతున్నారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఆర్టీసి నష్టాలలో ఉందని కింద నుంచి పైదాకా అందరికీ తెలిసి ఉన్నప్పుడు, వాటిని తగ్గించుకోవడానికి గట్టిగా ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదు? చేస్తున్న ప్రయత్నాలు ఎందుకు ఫలించడం లేదు? అని అందరూ ఆత్మవిమర్శ చేసుకోవడం చాలా అవసరం ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు బారీగా లాభాలు గడిస్తున్నప్పుడు, వాటికంటే పదింతలు పెద్దదైన ఆర్టీసి ఎందుకు లాభాలు గడించలేకపోతోంది? అనే సిఎం కెసిఆర్ ప్రశ్నకు రవాణామంత్రి, ఆర్టీసి యాజమాన్యమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది తప్ప కార్మికులు కారు. 


Related Post