సీనియర్ కాంగ్రెస్ నేత కాంగ్రెస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. శనివారం సాయంత్రం అయన తన అనుచరులతో కలిసి సిఎం కెసిఆర్ సమక్షంలో తెరాసలో చేరబోతున్నారు.
తన రాజకీయ శత్రువు అయిన నాగం జనార్ధన్ రెడ్డిని పార్టీలో చేర్చుకొంటే తాను బయటకు వెళ్ళిపోతానని దామోదర్ రెడ్డి మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ అయన అభ్యంతరాలను పట్టించుకోకుండా నాగం జనార్ధన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి పట్టుపట్టి నాగంను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించారని దామోదర్ రెడ్డి ఆరోపించారు.
రాబోయే ఎన్నికలలో నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేసేందుకు నాగం జనార్ధన్ రెడ్డికి టికెట్ ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందని అయన అనుచరులు ప్రచారం చేసుకొంటున్నారు. దానిని దామోదర్ రెడ్డి గట్టిగా ఖండించారు. కానీ రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం ఖండించకపోవడంతో అది నిజమేనని దృవీకరించినట్లయింది. అందుకే అయన కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు.
ఈ విషయం తెలియగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ నిన్న అయనను కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ప్రయత్నం ఫలించలేదు. ఆమె కూడా నాగం జనార్ధన్ రెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ ఆమె కూడా కాంగ్రెస్ పార్టీని వీడితే నాగం జనార్ధన్ రెడ్డి రాకతో పార్టీకి లాభం కలుగకపోగా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది.