కోమటిరెడ్డి హెచ్చరిక పనిచేసిందా?

June 08, 2018


img

కాంగ్రెస్ పెద్దలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన విమర్శలు బాగానే పనిచేసినట్లున్నాయి. తెరాస సర్కార్ తమ ఇద్దరి శాసనసభ్యత్వాలను రద్దు చేస్తే కాంగ్రెస్ పెద్దలకు చీమ కుట్టినట్లులేదని, ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. వారికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామని జానారెడ్డి సవాలు విసిరారు. 

కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఈ ఆరోపణలు రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలలో కాస్త చలనం కలిగించినట్లున్నాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని జానారెడ్డి నివాసంలో సి.ఎల్.పి. సమావేశం నిర్వహించి ఈ సమస్యపై చర్చించారు. ఈ సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ఇద్దరూ హాజరయ్యారు. కానీ నాగం జనార్ధన్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి హాజరుకాలేదు. ఈ సమావేశంలో వారు లేవనెత్తిన సమస్యపై కూడా చర్చించారు. 

సమావేశం అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు. వారి సభ్యత్వాలను రద్దు చేసే హక్కు ప్రభుత్వానికి, స్పీకర్ కు లేవు. ఆ మాట హైకోర్టు స్వయంగా చెప్పినప్పటికీ వారి సభ్యత్వాలను ఇంతవరకు పునరుద్దరించలేదు. ఇది కోర్టు ధిక్కారణ కిందే వస్తుంది మేము త్వరలోనే స్పీకర్ ను కలిసి దీని గురించి మాట్లడబోతున్నాము. ఒకవేళ అయన మా ఇద్దరి ఎమ్మెల్యేల సభ్యత్వాలను తక్షణం పునరుద్దరించకపోతే మేము మళ్ళీ హైకోర్టును ఆశ్రయిస్తాము. మేము త్వరలోనే రాష్ట్రపతిని కలిసి తెరాస సర్కార్ నిరంకుశ, అప్రజాస్వామికపాలన గురించి తెలియజేస్తాము,” అని అన్నారు.

ఈ సమస్య గురించి ప్రభుత్వంతో గట్టిగా పోరాడే అవకాశం ఉన్నప్పటికీ టి-కాంగ్రెస్ నేతలు పెద్దగా పట్టించుకోకపోవడంతో అది పార్టీలో అంతర్గత యుద్ధానికి దారితీసింది. అప్పుడు మేల్కొని హడావుడిగా సి.ఎల్.పి.సమావేశం ఏర్పాటుచేశారు. కానీ ఆ సమస్య పరిష్కారంకాక మునుపే డికె అరుణ, దామోదర్ రెడ్డిలు మరో సమస్యను లేవనెత్తారు. ఇక దానిని ఎప్పుడు ఏవిధంగా పరిష్కరిస్తారో చూడాలి. 

అధికారంలో ఉన్నప్పుడు, ఎన్నికలు లేనంతకాలం కాంగ్రెస్ పార్టీ చాలా బలంగానే ఉంటుంది. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు పార్టీలో ఈవిధంగా అంతర్గత కలహాలు, ముఠాలు మొదలవుతాయి. సరిగ్గా ఇదే కారణం చేత 2014 ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తృటిలో అధికారం చేజార్చుకొంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో తరచూ వినిపించే ఒక మాట మళ్ళీ వినబడింది. “కాంగ్రెస్ పార్టీని బయటవారు ఎవరూ ఓడించలేరు. తనను తానే ఓడించుకున్నప్పుడు మాత్రమే బయటివారు గెలుస్తుంటారు. తెరాస కూడ అలాగే గెలిచింది.” టి-కాంగ్రెస్ నేతల కీచులాటలు, అనైఖ్యత చూస్తుంటే 2019 ఎన్నికల తరువాత కూడా మళ్ళీ అదే మాట చెప్పుకోవాలేమో?


Related Post