ప్రణబ్ ఉపదేశం వారిద్దరికేనా?

June 08, 2018


img

అచ్చమైన కాంగ్రెస్ నాయకుడు, లౌకికవాది అయిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హిందుత్వ అజెండాతో పనిచేసే ఆర్.ఎస్.ఎస్. సంస్థ సమావేశానికి హాజరవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా కలవరపడింది. పార్టీలో కొందరు తొందరపడి ఆయనపై నోరు జారారు కూడా. కానీ అయన నిన్న నాగపూర్ లో జరిగిన ఆర్.ఎస్.ఎస్. సమావేశంలో దాని కార్యాకర్తలను ఉద్దేశ్యించి చేసిన ప్రసంగంలో వారికీ..వారితో పాటు భాజపా అధ్యక్షుడు అమిత్ షాకి, ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీకి గురోపదేశం చేసినట్లు మాట్లాడారు. ఒకప్పుడు గుజరాత్ అల్లర్లు చెలరేగినప్పుడు అప్పటి ప్రధాని వాజ్ పేయి నరేంద్ర మోడీకి ‘రాజధర్మం’ పాటించాలని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ అదే చెప్పారు. 

భారతదేశంలో ఎన్ని కులాలు, మతాలు, బాషలు, యాసలు ఉన్నప్పటికీ మనమందరిదీ ఒకటే దేశం..ఒకటే జెండా..  అనే భావనతో యుగయుగాలుగా అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారని అదే భారతదేశం గొప్పదనమని చెప్పారు.  భారతీయత గొప్పదనం పరమత సహనం, భిన్నత్వంలో ఏకత్వంలోనే ఉందని అందరూ గ్రహించాలని చెప్పారు. ద్వేషం, అసహనం భారతదేశ లౌకికవాద పునాదులను దెబ్బ తీస్తాయని దేశప్రగతికి అవరోధంగా మారతాయని అన్నారు.    కనుక అందరూ ఆ జాతీయభావనను బలపరిచేవిధంగా వ్యవహరించలే తప్ప దానిని చిన్నాభిన్నం చేయకూడదని చెప్పారు.

భాజపా, ఆర్.ఎస్.ఎస్.సంస్థ, ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా తదితరులు తరచూ‘జాతీయవాదం’ గురించి మాట్లాడుతుంటారు. కానీ వారు హిందుత్వాన్ని జాతీయవాదంగా భావిస్తుంటారు. అందరూ దానినే పాటించాలని కోరుకుంటారు. వారి వాదనలతో ఏకీభవించనివారిని భారతదేశాన్ని వ్యతిరేకిస్తున్నవారిగా భావిస్తుంటారు. అనేక మతాలు, కులాలతో నిండిన భారతదేశంలో భాజపా, ఆర్.ఎస్.ఎస్.ల ఈ వాదనలను అంగీకరించడం సాధ్యమేనా? అంటే కాదనే అందరికీ తెలుసు. భాజపా ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది కనుకనే వారు తమ వాదనలను బలంగా వినిపిస్తూ వాటినే అందరూ అంగీకరించాలని గట్టిగా నొక్కి చెప్పగలుగుతున్నారని చెప్పకతప్పదు. 

అది తగదని ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. అంటే అధికారంలో ఉన్నావారు తప్పనిసరిగా ‘రాజధర్మం’ పాటించాలని చెప్పినట్లు భావించవచ్చు. కానీ ఈరోజుల్లో స్వయంగా గాంధీ మహాత్ముడే దిగివచ్చి చెప్పినా ఎవరూ ఎవరి మాటలు వినే పరిస్థితిలో లేరు. కనుక ప్రణబ్ ముఖర్జీది కంఠశోషగానే మిగిలిపోతుంది అని వేరే చెప్పనవసరం లేదు. 


Related Post