నన్ను టార్గెట్ చేస్తే ఊరుకోను: డికె అరుణ

June 07, 2018


img

గద్వాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలను ఉద్దేశ్యించి పరోక్షంగా హెచ్చరికలు చేశారు. నాగం జనార్ధన్ రెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి పార్టీ వీడేందుకు సిద్దపడటంతో డికె అరుణ ఆయన ఇంటికివెళ్ళి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. 

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “ఇంతకాలం మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉండేవికావు. అందరం కలిసికట్టుగా పనిచేసేవారం. కానీ ఇప్పుడే వర్గాలనే పదం వినిపిస్తోంది. ఇది చాలా దురదృష్టకరం. పార్టీలో కొందరు పెద్దలు నన్ను టార్గెట్ చేసుకొని రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. పార్టీలో నేను సీనియర్ నేతను. నన్ను టార్గెట్ చేసి దెబ్బతీయాలని చూస్తే చేతులు ముడుచుకొని కూర్చొను. అయినా జిల్లాలో బలమైన నేతలను స్వంతపార్టీవారే దెబ్బతీసుకుని బయట నుంచి కొత్త వ్యక్తులను తెచ్చుకొని ఏమి సాధిస్తారు? నన్ను దెబ్బ తీస్తే రాజకీయంగా నేను నష్టపోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని గ్రహిస్తే మంచిది. నాగం జనార్ధన్ రెడ్డికి ఏమి బలం ఉందని పార్టీలోకి తీసుకువచ్చారు? ఆయనకు తెదేపాలో ఉన్నప్పుడు బలం ఉండేది కానీ ఇప్పుడు లేదని అందరికీ తెలుసు. మేము వద్దని వారిస్తున్నా అటువంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకువచ్చారు. నాకు నా స్వీయ రాజకీయ ప్రయోజనాలకంటే  పార్టీ ప్రయోజనాలే ముఖ్యం. కనుక నాపని నేను చేసుకుపోతుంటాను. ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని నేను కోరుకొంటున్నాను. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వలనేది నా కోరిక. అందుకోసం ఎంత కష్టమైనా భరించేందుకు నేను సిద్దం,” అని అన్నారు. 

వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రతీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా చాలా కీలకం కానుంది. ఈ సంగతి తెలిసి కూడా చేజేతులా జిల్లాలో పార్టీని బలహీనపరుచుకోవడం ఆశ్చర్యకరమే. నాగం జనార్ధన్ రెడ్డి, డికె అరుణలను పోల్చి చూస్తే వారిలో డికె అరుణ బలమైన నేత అని ఎవరైనా చెపుతారు. మరి నాగం కోసం ఆమెను వదులుకుంటే లేదా నాగం కారణంగా ఆమె బయటకు వెళ్ళిపోయినా దానికి మూల్యం చెల్లించేది కాంగ్రెస్ పార్టీయే. ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు గెలుపు గుర్రాలను కాపాడుకోవాలి కానీ కొత్తగుర్రాలతో ప్రయత్నిద్దామనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. 


Related Post