తెరాస ఎమ్మెల్యేలలో 39మంది డేంజర్ జోన్?

June 07, 2018


img

రైతుబంధు పధకం అమలుపై రాష్ట్రంలో రైతులు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సర్వేలో తేలిందని ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా చెప్పారు. కానీ ఆ సర్వేలోనే ఒక షాకింగ్ విషయం కూడా బయటపడినట్లు సమాచారం. 

ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక పధకాల కారణంగా ప్రభుత్వ పనితీరు పట్ల, తెరాసపట్ల రాష్ట్ర ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ, 39 మంది తెరాస ఎమ్మెల్యేల పనితీరుపట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆ సర్వేలో తేలినట్లు సమాచారం. 

ఇతర పార్టీల నుంచి తెరాసలోకి వచ్చినవారితో కలుపుకుంటే తెరాసలో ఇప్పుడు మొత్తం 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 39 మంది ఎమ్మెల్యేలంటే 35శాతం. అదేమీ విస్మరించదగ్గ విషయం కాదు. ఆ అసంతృప్తి కారణంగా వచ్చే ఎన్నికలలో వారిలో 20-25 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయినా తెరాస పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది. 

ఉత్తర తెలంగాణాలో కంటే దక్షిణ తెలంగాణా జిల్లాలలో తెరాస ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆ సర్వేలో తేలింది. ప్రజలే కాకుండా వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు కూడా తెరాస ఎమ్మెల్యేల తీరుపట్ల ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాలో ఇద్దరు మంత్రులు, కార్పోరేషన్ చైర్మన్లు, విప్ లు కూడా ఉన్నట్లు సమాచారం. 

సర్వే నివేదికతో అప్రమత్తమైన సిఎం కెసిఆర్ వారిలో కొందరితో నేరుగా మాట్లాడి పనితీరు మెరుగుపరుచుకోవాలని హెచ్చరించగా, మరికొందరికి వారు సన్నిహితంగా ఉండే మంత్రులద్వారా హెచ్చరికలు పంపినట్లు సమాచారం. ఆ జాబితాలో మంత్రి హరీష్ రావు అనుచరులు (ఎమ్మెల్యేలు) కూడా ఉన్నట్లు సమాచారం. 

ఇదివరకు చేయించుకున్న సర్వేలలో కూడా కొందరు ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని తెలిసినప్పుడు సిఎం కెసిఆర్ వారిని గట్టిగా హెచ్చరించారు. ఎమ్మెల్యేల పనితీరు బాగోలేకపోయినప్పటికీ ప్రజలలో తెరాస సర్కార్ పనితీరుపట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం అయినందున, వచ్చే ఎన్నికలలో కనీసం 100 సీట్లు తప్పకుండా గెలుచుకోగలమని సిఎం కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఆ ధీమాతోనే “ఇంతకంటే గొప్పగా పనిచేసేవారు కావాలంటే ఆకాశం నుంచి దిగిరావాలి. అది సాధ్యం కాదు కనుక వచ్చే ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్ళీ టికెట్స్ ఇస్తామని” సిఎం కెసిఆర్ స్వయంగా ప్రకటించారు. 

మంత్రి కేటిఆర్ మరో అడుగు ముందుకువేసి “వచ్చే ఎన్నికలలో తెరాస 100 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి రాలేకపోతే నేను రాజకీయ సన్యాసం చేయడానికి సిద్దం.. కాంగ్రెస్ పార్టీ నా సవాలును స్వీకరించగలదా?” అని ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాలు విసిరారు. 

కానీ తాజా నివేదికలో పేర్కొన్నట్లు39 మంది తెరాస ఎమ్మెల్యేల పనితీరుపట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉండటం నిజమైతే, తెరాసకు ప్రమాదఘంటికలు మొగుతున్నట్లే భావించవచ్చు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహుశః ఈవిషయం గ్రహించే "ఇదే ఎమ్మెల్యేలతో తెరాస వచ్చే ఎన్నికలలో పూటే చేసినట్లయితే, కాంగ్రెస్తె పార్టీ తెరాసను అవలీలగా ఓడిస్తుందని ఎప్పుడో చెప్పారు. అటువంటి పరిస్థితే ఉందని  సిఎం కెసిఆర్ భావిస్తే వారినందరినీ పక్కనపెట్టి గెలుపు గుర్రాలకు టికెట్స్ కేటాయించినా ఆశ్చర్యపోనక్కరలేదు.


Related Post