కాంగ్రెస్ వస్తే రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయా?

June 06, 2018


img

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల ఆత్మహత్యలు నిలిచిపోతాయా? లేదా జరగకుండా నివారిస్తామని  కాంగ్రెస్ నేతలు ఎవరైనా హామీ ఇవ్వగలరా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకు ముందు 10 ఏళ్ళపాటు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, సమైక్య రాష్ట్రాన్ని పాలించినప్పుడు దేశవ్యాప్తంగా వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కారణాలు అందరికీ తెలుసు. నేటికీ తెలంగాణాతో సహా అన్ని రాష్ట్రాలలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. 

కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను లెక్కిస్తూ తెరాస సర్కార్ చేతులు ముడుచుకొని కూర్చోలేదు. దశాబ్దాలుగా వ్యవసాయ రంగాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలను ఒకటొకటిగా కాకుండా అన్నిటినీ ఒకేసారి సమాంతరంగా యుద్ధప్రాతిపదికన పరిష్కరించడానికి చాలా చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. వ్యవసాయ రంగాన్ని తద్వారా రైతులను ఏవిధంగా ఆదుకోవచ్చో కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు సిఎం కెసిఆర్. 

అనేక చిన్నా పెద్ద సాగునీటి పధకాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తుండటం, మిషన్ కాకతీయ, 24 గంటల నిరంత ఉచిత విద్యుత్ సరఫరా, పంట పెట్టుబడి, గోదాముల నిర్మాణం, మార్కెటింగ్ శాఖను బలోపేతం చేయడం, ప్రణాళికాబద్ధమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, కొత్తగా వ్యవసాయ అధికారులను నియమించడం వంటి అనేకానేక చర్యలు చేపట్టారు. వాటి కారణంగా త్వరలోనే రాష్ట్రంలో వ్యవసాయరంగం అద్భుతమైన ప్రగతి సాధించి రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చివేయబోతోందని ఖచ్చితంగా చెప్పవచ్చు. 

తెలంగాణాలో వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసేందుకు తెరాస సర్కార్ చేస్తున్న ఈ ప్రయత్నాలను యావత్ దేశప్రజలు చాలా నిశితంగా గమనిస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ గమనించడం లేదని ఆ పార్టీ నేతల మాటలతో స్పష్టం అవుతోంది. తెరాస కూడా రాజకీయ లబ్ది కోసం ప్రాకులాడుతుండవచ్చు కానీ వ్యవసాయరంగాన్ని సమస్యల ఊబిలో నుంచి పైకిలాగడానికి అది చేస్తున్న ప్రయత్నాలను ఎవరూ కాదనలేరు. వాటితో వ్యవసాయ రంగం...దానిపైనే ఆధారపడి జీవిస్తున్న లక్షలాది రైతులు బాగుపడితే, ఎవరూ అడగకపోయినా ప్రజలు తెరాసకే మళ్ళీ పట్టం కట్టడం ఖాయం.

కనుక రాజకీయ పార్టీలు అధికారం కోసం హామీలు ఇచ్చే అలవాటును మానుకొని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఏమి చేయాలో ఆలోచించుకొని అవి మాత్రమే చేస్తామని హామీ ఇస్తే చాలు. ఆ హామీలు నమ్మశక్యంగా ఉంటే ప్రజలు తప్పకుండా గెలిపిస్తారు.


Related Post