అధికారానికి షార్ట్ కట్ పంటరుణాల మాఫీ?

June 06, 2018


img

దేశంలో రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఆత్మహత్యలు నివారించడానికి ప్రభుత్వాలు ఏమి చేయాలి? అని ఆలోచించకుండా దానికి ఏకైక పరిష్కారం పంటరుణాల మాఫీయే అన్నట్లు రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు వ్యవహరిస్తుండటం చాలా బాధాకరం. 

2014 ఎన్నికల సమయంలో కెసిఆర్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించినప్పుడు, రిజర్వ్ బ్యాంక్ కూడా దానిని తీవ్రంగా వ్యతిరేకించింది. దానివలన దేశ ఆర్ధిక క్రమశిక్షణ గాడి తప్పుతుందని వాదించింది. కానీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ తో సహా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో పంటరుణాలను మాఫీ చేస్తామని పోటీలుపడి హామీలు గుప్పిస్తున్నాయి. 

ఇప్పుడు దానిలో కూడా పోటీ తీవ్రతరం అవుతుండటంతో టి-కాంగ్రెస్ మరో అడుగు ముందుకు వేసి సాధ్యాసాధ్యాలు చూడకుండా తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల పంటరుణాలను ఒకే వాయిదాలో మాఫీ చేస్తామని హామీ గుప్పిస్తోంది. 

లక్ష రూపాయలను నాలుగు వాయిదాలలో చెల్లించడమే కష్టమైనప్పుడు ఒకేసారి రూ.2 లక్షలు ఏవిధంగా మాఫీ చేయగలదో చెప్పాలని సిఎం కెసిఆర్ విసిరిన సవాలుకు టి-కాంగ్రెస్ నేతలు జవాబు చెప్పకుండా తప్పించుకుంటున్నారు. అలాగని అవకాశం చిక్కినప్పుడల్లా ఆ హామీని ప్రజల ముందు నెమరు వేయడం మానలేదు. 

మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరొక నాలుగైదు నెలలో జరుగబోతున్నాయి. గత 15 ఏళ్లుగా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండిపోయింది. కనుక రాబోయే ఎన్నికలలో ఏవిధంగానైనా గెలిచి అధికారంలోకి రావాలని రాహుల్ గాంధీ చాలా పట్టుదలగా ఉన్నారు. కనుక మంద్ సౌర్ జిల్లాలో పిప్లియామండిలో బుధవారం జరిగిన రైతు ర్యాలీలో పాల్గొన్నప్పుడు వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్రంలో మా పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే కేవలం 10 రోజులలోనే రైతులందరి రుణాలు మాఫీ చేస్తాము. దేశంలో ఏడాదికి సుమారు 1,200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ అబద్దాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారు,” అని అన్నారు. 

అంటే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసమే ఆ హామీ ఇస్తోందని అర్ధమవుతూనే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల ఆత్మహత్యలు నిలిచిపోతాయా? లేదా నివారిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇవ్వగలరా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇదివరకు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో సమైక్య రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కారణాలు అందరికీ తెలుసు. నేటికీ తెలంగాణాతో సహా అన్ని రాష్ట్రాలలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. 

ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న రైతులను ప్రభుత్వాలు ఆదుకోవడం తప్పు కాదు కానీ ఆ హామీతో అధికారం సంపాదించాలనుకోవడమే తప్పు. 

నిజానికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కేంద్రప్రభుత్వంతో సహా దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించిన దాఖలాలు లేవు. ప్రయత్నించి ఉంటే నేడు రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసిన దుస్థితి ఉండేదే కాదు.


Related Post