ఎన్నికలకు మేము రెడీ: కోదండరాం

June 06, 2018


img

జూలై నెలలో జరుగబోయే పంచాయితీ ఎన్నికలలో పోటీ చేసేందుకు తెలంగాణా జనసమితి (టిజెఎస్) సిద్దంగా ఉందని ఆ పారీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. రైతుబంధు పధకం పేరుతో ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధికసహాయం నిజంగా ఆ అవసరమున్న పేద రైతులకు కాక భూస్వాములకు, రాజకీయ నాయకులకు లబ్ది కలిగిస్తోందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఇక తెరాస సర్కార్ గొప్పగా చెప్పుకొంటున్న సమగ్ర భూరికార్డుల ప్రక్షాళన వలన కూడా రాష్ట్రంలో పేదరైతులు నష్టపోతున్నారని అన్నారు. రైతులకు పంపిణీ చేసిన పాసుపుస్తకాలలో కూడా అనేక తప్పులు దొర్లాయని ఆ కారణంగా రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 

తెలంగాణా ఉద్యమాలలో పాల్గొన్న కారణంగా ప్రొఫెసర్ కోదండరాంకు రాష్ట్రప్రజలలో చాలా గౌరవం ఉన్నమాట వాస్తవం. అయితే తెరాస నేతలు ఆయనపై కాంగ్రెస్ ముద్రవేసి చేసిన విమర్శల కారణంగా, ఆయన తెరాస సర్కార్ పై చేస్తున్న విమర్శల కారణంగా అయనకు ప్రజాధారణ కాస్త తగ్గినట్లు కనబడుతోంది. కానీ తాను కెసిఆర్ కు సమఉజ్జీనని భావిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం ఆ దైర్యంతోనే తెలంగాణా జనసమితిని ఏర్పాటు చేసుకుని ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించారు. కనుక పంచాయితీ ఎన్నికలు ఆయనకు ఒకరకంగా బలపరీక్షవంటివని చెప్పవచ్చు. పంచాయితీ ఎన్నికలలో తెలంగాణా జనసమితి తన సత్తాను చాటుకోగలిగితేనే 2019సార్వత్రిక ఎన్నికల గురించి ఆలోచించవచ్చు. లేకుంటే అప్పుడు పోటీ చేయడానికి తెలంగాణా జనసమితికి బహుశః అభ్యర్ధులే దొరకకపోవచ్చు. కనుక ఈ ఎన్నికలు దానికి సెమీఫైనల్స్ వంటివేనని చెప్పవచ్చు. 


Related Post