తెరాసలోకి వెళ్ళి గుత్తా తప్పు చేశారా?

June 06, 2018


img

నల్గొండ కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి కాంట్రాక్టుల కోసం కక్కుర్తిపడి తెరాసలో చేరినందుకు ఇప్పుడు చాలా బారీ మూల్యం చెల్లిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పైసా ఖర్చు చేయకుండా రెండుసార్లు ఎంపిగా ఎన్నికయిన గుత్తా పార్టీకి ద్రోహం చేసి తెరాసలో చేరడమే కాకుండా తనకు సంచిత గౌరవం కల్పించిన కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు విమర్శిస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుత్తా ఇకనైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు.     

పార్టీ మారిన తరువాత నేతలు విమర్శలు చేయడం మామూలే. కానీ తెరాసలో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి బారీ మూల్యం చెల్లిస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలే ఆలోచింపజేస్తున్నాయి. అంటే వచ్చే ఎన్నికలలో ఆయనకు తెరాస టికెట్ లభించదా? లేక ఇప్పుడు కాంట్రాక్టులు లభించడం లేదా? లేక మరేదైనా బలమైన కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

కాంగ్రెస్ పార్టీ నుంచి తెరాసలో చేరిన మందా జగన్నాధం, కె. కేశవరావు, డి.శ్రీనివాస్ వంటి సీనియర్లకు తెరాసలో ఆశించినంత గౌరవం, సముచిత స్థానం లభించలేదు. అదే...గుత్తా సుఖేందర్ రెడ్డికి తెలంగాణా రైతు సమన్వయ సమితి కార్పోరేషన్ చైర్మన్ పదవి లభించింది. దానినే మరోవిధంగా చెప్పుకోవాలంటే రాష్ట్రంలో రైతులందరికీ ఆయనను నాయకుడిగా చేశారు. ఇక బహిరంగ సభలలో ఆయన పట్ల సిఎం కెసిఆర్ చాలా గౌరవం ప్రదర్శిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక గుత్తాకు తెరాసలో ఎందుకు ఇబ్బంది పడుతున్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పాలి.


Related Post