గులాబీకూలి గురించి రేవంత్ ప్రశ్నించకూడదా?

June 06, 2018


img

ప్రతీ ఏటా తెరాస ప్లీనరీ సమావేశాల నిర్వహణ ఖర్చుల కోసం తెరాస మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఆపార్టీ నేతలు గులాబీకూలి పేరిట రాష్ట్రంలో వ్యాపారసంస్థల నుంచి బలవంతంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని, అధికారంలో ఉన్నవారు ఆవిధంగా చేయడం అవినీతికి పాల్పడటమేనని కనుక వారందరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హైకోర్టులో కొన్ని నెలల క్రితం ఒక పిటిషన్ వేశారు. దానిపై హైకోర్టు నిన్న విచారణ జరిపింది. 

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తరపు వాదించిన న్యాయవాది సివి.మోహన్ రెడ్డి, “తెరాస మంత్రులు చేస్తున్న బలవంతపు వసూళ్ళకు ‘గులాబీకూలి’ అని ముద్దుపేరు పెట్టుకున్నప్పటికీ, చట్టప్రకారం అది నేరం. ఒక వ్యక్తి 8గంటలు పనిచేసి అందుకు తగ్గ డబ్బు తీసుకుంటే అది కూలి అవుతుంది. కానీ తెరాస మంత్రులు, ప్రజాప్రతినిధులు కేవలం 5-10 నిమిషాల సేపు ఉప్పు, పప్పులు, టీలు, ఫ్రూట్ జ్యూసులు అమ్మినట్లు నటించి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. అది కూలి ఎలా అవుతుంది? ఒకవేళ ఆమాత్రం పనితో లక్షలు ఆర్జించే అవకాశం ఉన్నట్లయితే ప్రపంచంలో అందరూ అదేపని చేసి ఉండేవారు కదా? తెరాస అధికారంలో ఉంది కనుక వ్యాపారస్తులు భయపడి వారు అడిగినంతా డబ్బు ముట్టజెప్పక తప్పడంలేదు. దీనిపై మా క్లైంట్ రేవంత్ రెడ్డి అవినీతి నిరోధకశాఖకు పిర్యాదు చేస్తే వారు కనీసం కేసు నమోదు చేయకుండా బాధ్యాతారాహిత్యంగా వ్యవహరించారు. అధికారంలో ఉండిఈవిధంగా బహిరంగంగా అవినీతికి పాల్పడుతున్నవారిని ఉపేక్షించడం మంచిదికాదు కనుక అందరిపై చర్యలు తీసుకోవలసిందిగా ప్రార్ధిస్తున్నాను,” అని అన్నారు. 

ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది శరత్ కుమార్ స్పందిస్తూ, “ఈ కేసులో పిటిషనర్ ముఖ్యమంత్రితో సహా అందరిపై ఆరోపణలు చేశారు. కానీ వాటిని నిరూపించే ఆధారాలు సమర్పించలేకపోయారు. అందుకే అవినీతి నిరోధకశాఖ కేసు నమోదు చేయలేదు. అయినా ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రేవంత్ రెడ్డి పాత్ర ఏమిటో ఇంకా ఖరారు కావలసి ఉంది. కనుక అయన వేసిన ఈ పిటిషన్ విచారణ అర్హమైనది కాదు. ఈ కేసులో ప్రభుత్వం తరపున కౌంటర్ వేయడానికి 4వారాలు గడువు ఇవ్వవలసిందిగా న్యాయస్థానాన్ని కోరుతున్నాను,” అని వాదించారు. 

అయన అభ్యర్ధనను మన్నించిన న్యాయమూర్తి ఏ. రాజశేఖర్ రెడ్డి ఈ కేసు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేశారు. 

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్ననంత మాత్రాన్న ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అనర్హుడని ప్రభుత్వ న్యాయవాది వాదించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏకంగా 11 ఛార్జ్-షీట్లు నమోదు చేయబడ్డాయి. వాటన్నిటిలోను అయన ఏ-1 ముద్దాయిగా ఉన్నారు. అయినప్పటికీ ఏపి సర్కార్ ను రోజూ నిలదీస్తూనే ఉన్నారు. ఎయిర్ సెల్ కేసులో నిందితుడిగా పేర్కొనబడ్డ మాజీ కేంద్ర ఆర్ధికమంత్రి పి చిదంబరం మోడీ సర్కార్ ను నిత్యం నిలదీస్తూనే ఉన్నారు. ఇలా చెప్పుకుంటే పోతే చాలా పెద్ద జాబితాయే ఉంది. కనుక ఓటుకు నోటు కేసు లో రేవంత్ రెడ్డి నిందితుడు కనుక ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని వాదించడం కంటే రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపమని అడిగి ఉంటే బాగుండేదేమో? ఎందుకంటే, గులాబీకూలి ‘చెల్లించుకున్నవారు’ తామే స్వచ్చందంగా ఇచ్చామని చెప్పుకొంటారు తప్ప తమపై తెరాస మంత్రులు ‘కూలి’ కోసం ఒత్తిడి చేశారని చెప్పరు కదా! 


Related Post