తెరాసను ఉఫ్ అని ఉదేస్తాం: భాజపా

June 06, 2018


img

భాజపా జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు తెరాస గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ఓబిసి మోర్చా సమావేశంలో పార్టీ కారకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెరాస అధికారంలో ఉంది కనుక పైకి చాలా బలంగా కనబడుతోంది. కానీ ఒక్కసారి అధికారం కోల్పోతే దానిని ఉఫ్ మని ఊదితే కనబడకుండాపోతుంది. కర్ణాటకలో ఓబిసి మోర్చ కార్యకర్తల కృషి కారణంగానే భాజపాకు విజయావకాశం లభించింది. తెలంగాణా రాష్ట్రంలో కూడా ఓబిసి మోర్చా గట్టిగా కృషి చేస్తే తెరాసను ఓడించి అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదు,” అని అన్నారు. 

తెరాస గురించి మురళీధర్ రావు ఈవిధంగా అనగలిగారంటే అందుకు బలమైన కారణమే ఉంది. తెరాసకు రాష్ట్రంలో మంచి బలం, ప్రజాధారణ ఉన్నప్పటికీ నేటికీ అది గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు పార్టీని నిర్మించుకోకుండా, తెలంగాణా సెంటిమెంటు ఆధారంగానే ఎన్నికలలో గట్టెక్కుతోందనే అపవాదు ఉంది. రాష్ట్రంలో అన్ని పార్టీలపై ఏదో ఒక ముద్ర వేసేసి తెరాస ఒక్కటే ‘ఇంటిపార్టీ’ అనే భావన ప్రజలలో వ్యాపింపజేయడానికి ప్రయత్నిస్తుంటుంది. కానీ తెలంగాణా సెంటిమెంటు ఉపయోగించకుండా అది కేవలం సంస్థాగతబలంతోనే ఎన్నికలను ఎదుర్కొన్నట్లయితే తెరాసను అవలీలగా ఓడించవచ్చునని కాంగ్రెస్, భాజపా తదితర పార్టీలు భావిస్తుంటాయి. అందుకే మురళీధర్ రావు ఆమాట అనగలిగారని చెప్పవచ్చు. 

కానీ తెలంగాణాలో తిరుగులేని రాజకీయశక్తిగా ఎదిగిన తెరాసను వచ్చే ఎన్నికలలో ఓడించడం భాజపా వల్ల అయ్యే పనేనా?అంటే ఖచ్చితంగా కాదనే సమాదానం చెప్పవలసి వస్తుంది. వచ్చే ఎన్నికలలో తెరాసను ఓడించడం మాట దేవుడెరుగు..భాజపా ఎమ్మెల్యేలు మళ్ళీ తమ స్థానాలలో గెలిస్తేచాలు..అదే గొప్ప విషయం అవుతుంది. 

ఒకప్పుడు కర్ణాటకలో భాజపా అధికారంలో ఉండేది కనుక ఆ రాష్ట్రంలో దానికి బలముంది. ఆ కారణంగా ఎన్నికలలో ప్రజల మద్దతు లభించింది. కానీ తెలంగాణాలో భాజపాకు ఆ అవకాశం ఇంకా రాలేదు. ఇంకా ఎప్పటికి వస్తుందో తెలియదు కనుక అంతవరకు నిరభ్యంతరంగా పగటి కలలు కనవచ్చు. 


Related Post