కాంగ్రెస్ ను ముంచింది ఆయనే: లక్ష్మణ్

June 05, 2018


img

ప్రధాని నరేంద్ర మోడీ ‘దేశప్రజలను ఇక్కట్లు పాలుచేసి రాక్షసానందం పొందే వ్యక్తి’ అంటూ జైపాల్ రెడ్డి నిన్న తీవ్ర విమర్శలు చేశారు. అయనకు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ ధీటుగా బదులిచ్చారు. 

“జైపాల్ రెడ్డి ఎన్ని పార్టీలు మారారో అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీని ముంచింది ఆయనే. పార్టీని నిలువునా ముంచేసి దాని కోసం ఇప్పుడు పరితపించిపోతున్నట్లు మాట్లాడుతున్నారు. అయన కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణాకి ఏమి చేశారు? అటు స్వంత పార్టీకి, స్వంత రాష్ట్రానికి ఏమీ చేయలేని జైపాల్ రెడ్డి దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ అవినీతిరహితమైన పాలన అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుంది. ప్రధాని మోడీని విమర్శించే నైతికహక్కు కాంగ్రెస్ నేతలకు లేదు,” అని అన్నారు. 

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కీలకదశకు వచ్చినప్పుడు పార్లమెంటులో తానే చాలా కీలకపాత్ర పోషించానని, ఆనాడు తాను చురుకుగా వ్యవహరించకపోయుంటే తెలంగాణా ఏర్పాటుకు మరింత కాలం పట్టేదని ఒకసారి జైపాల్ రెడ్డి చెప్పుకున్నారు. దానిలో నిజానిజాలు ఆయనకు, కాంగ్రెస్ నేతలకు, కెసిఆర్ కు తెలియాలి. అయితే తెలంగాణా ఉద్యమాలు జోరుగా సాగుతున్న సమయంలో జైపాల్ రెడ్డి తన కేంద్రమంత్రి పదవికే ప్రాధాన్యం ఇచ్చారు తప్ప ఏనాడూ ధైర్యం చేసి బహిరంగంగా తెలంగాణా కావాలని డిమాండ్ చేయలేదు. ఏమంటే కేంద్రమంత్రిగా నాకు కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పేవారు. 

2014 ఎన్నికలలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందున జైపాల్ రెడ్డి ఇప్పుడు తెలంగాణాలో కనిపిస్తున్నారు లేకుంటే అయన డిల్లీలోనే ఉండేవారేమో? ఒకవేళ ఆ ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంటే సిఎం రేసులో ఆయనే మొదట ఉండేవారు. 

ఇక డికె అరుణ, దామోదర్ రెడ్డి తదితరులు ఎంతగా మొత్తుకున్నా వినకుండా నాగంజనార్ధన్ను రెడ్డిని పార్టీలోకి తెచ్చిపెట్టారు. ఆ కారణంగా ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ నేతల మద్య చిచ్చు మొదలైంది. జైపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి తదితరులు ఒక వర్గంగా, డికె అరుణ, దామోదర్ రెడ్డి తదితరులు మరో వర్గంగా మారడంతో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా మారింది.


Related Post