కెసిఆర్ ఆలోచనలకు ఆచరణలో అవరోధాలు?

June 05, 2018


img

సిఎం కెసిఆర్ నిత్యం సరికొత్త సంక్షేమ పధకాలను, పాలనాపరమైన సంస్కరణలను అమలుచేయడానికి ప్రతిపాదనలు చేస్తుంటారు. కానీ పైస్థాయి నుంచి దిగువస్థాయివరకు అందరిలో అదే స్పూర్తి, పట్టుదల, చొరవ కొరవడటంతో కెసిఆర్ ప్రతిపాదనలకు ఆచరణలో అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయి. 

ఉదాహరణకు రాష్ట్రంలో సమగ్రభూసర్వే జరిపించి, భూరికార్డుల ప్రక్షాళన చేసి, రైతులందరికీ యాజమాన్యహక్కులను దృవీకరిస్తూ కొత్త పాసు పుస్తకాలను పంపిణీ చేయాలనుకుంటే, అనేక కారణాల వలన వాటిలో అనేక తప్పులు దొర్లాయి. ఆ కారణంగా ప్రభుత్వం ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి రావడమే కాకుండా అది ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టదలిచిన ‘ధరణి వెబ్ సైట్’ ను సకాలంలో ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడింది. 

అయినప్పటికీ మే 19వ తేదీ నుండి కొన్ని మండలాలలో ధరణి వెబ్ సైట్ ను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తే దానికి కూడా అనేక బాలారిష్టాలు ఎదురవుతున్నాయి. కొన్ని చోట్ల కరెంటు, సర్వర్, నెట్ వర్క్ సమస్యలు, కొన్నిచోట్ల దానిని నిర్వహించే సిబ్బందికి రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై అవగాహన లేకపోవడం, భూరికార్డులలో తప్పులు వంటి అనేక కారణాల చేత తహసిల్దార్ కార్యాలయాలలో  భూరిజిస్ట్రేషన్ల ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతోంది. 

ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లాలో గుడిహత్నూర్ మండలంలోని తహసిల్దార్ కార్యాలయంలో రెండురోజులలో ఒకే ఒక భూరిజిస్ట్రేషన్ జరుగగా, జోగుళాంబ గద్వాల్ జిల్లాలోని ఐజ తహసిల్దార్ కార్యాలయంలో 4 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. కానీ వనపర్తి జిల్లాలోని పెబ్బేరులో అన్ని సౌకర్యాలు సరిగ్గా అమరడంతో రెండు రోజులలో 15 రిజిస్ట్రేషన్లు జరిగాయి. 

కొత్తలో దేనికైనా ఇటువంటి సమస్యలు తలెత్తడం సహాజమే కనుక మెల్లమెల్లగా ఈ సమస్యలన్నీ పరిష్కారంకావచ్చు. అయితే సిఎం కెసిఆర్ చెపుతున్నంత సులువుగా తహసీల్దార్ కార్యాలయాలలో ఈ పనులు జరుగాలంటే రాష్ట్రస్థాయి  అధికారుల నుంచి జిల్లాస్థాయి కార్యాలయాలకు పూర్తి సహాయసహకారాలు, పర్యవేక్షణ చాలా అవసరం. 

ఇంతకంటే భారీ పదకాలైన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయవంటివి శరవేగంగా జరుగుతున్నాయంటే వాటిపై సమర్ధమైన పర్యవేక్షణ ఉందని అర్ధం. అదేవిధంగా భూరికార్డుల ప్రక్షాళన, రైతులందరికీ కొత్త పాసుపుస్తకాలను పంపిణీ, తహసిల్దార్ కార్యాలయాలలో ధరణి వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్లు, భూసారపరీక్షలు, రైతులకు విత్తనాల పంపిణీ మొదలైనవాటిలో కూడా సమర్ధమైన పర్యవేక్షణ ఉన్నట్లయితే త్వరలోనే ఈ సమస్యలన్నీ పరిష్కరించడం సాధ్యమే.


Related Post