కౌలు రైతులకు జీవితభీమా కూడా ఉండదా?

June 05, 2018


img

రాష్ట్రంలో కౌలురైతులకు రైతుబంధు పధకాన్ని వర్తింపజేయమని సిఎం కెసిఆర్ మళ్ళీ నిన్న మరోసారి నిర్మొహమాటంగా చెప్పారు. భూమి కలిగిన రైతులకే తాము పంటపెట్టుబడి అందిస్తామని కౌలు రైతులకు ఇవ్వలేమని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిన్న జరిగిన రైతుబంధు అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ జీవితభీమా పధకంతో రాష్ట్రంలో 58 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతారని అని అన్నారు. ఆగస్ట్ 15వ తేదీ నుంచి రాష్ట్రంలో రైతులందరికీ ఉచితంగా జీవితభీమా సౌకర్యం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కానీ కౌలు రైతులకు జీవితభీమా కల్పించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని సిఎం కెసిఆర్ మాటలను బట్టి అర్ధం అవుతోంది.

నిజానికి స్వంతభూమి ఉండి వ్యవసాయం చేసుకునే రైతులకంటే కౌలు రైతుల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంటుంది. పంటలు పండినా, పండకపోయినా కౌలు చెల్లించాల్సి ఉంటుంది. పంటలు పండకపోవడం వలన లేదా పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించక నష్టాలు వచ్చినందున రాష్ట్రంలో అనేకమంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా చేసుకొంటూనే ఉన్నారు. కనుక వారికే ఈ జీవితభీమా ఎక్కువ అవసరం. కానీ వారికి స్వంతభూమిలేని కారణంగా ప్రభుత్వం వారిని రైతులగా గుర్తించడం లేదు.

కనుక రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రైతు సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తున్నప్పటికీ లక్షలాదిమంది నిరుపేద కౌలురైతులను పట్టించుకోకపోతే సమస్యల కారణంగా వారి ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉంటాయి. ఆ కారణంగా రైతుల సంక్షేమం కోసం ఎంత చేసినప్పటికీ  ప్రభుత్వానికి అప్రదిష్ట తప్పకపోవచ్చు. కనుక కౌలు రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విధివిధానాలు, పధకాలు ప్రవేశపెట్టి వారి సమస్యలను పరిష్కారానికి ప్రయత్నిస్తే మంచిది. ఎంతైనా వారు కూడా తెలంగాణా (రైతులు) ప్రజలే కదా! 


Related Post