ఏమిటీ పంచాయితీ?

June 05, 2018


img

రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిపాలనా సౌలభ్యం, పాలన వికేంద్రీకరణ కోసం 10 జిల్లాలను పునర్వ్యస్తీకరించి 31 జిల్లాలు ఏర్పాటు చేసినట్లుగానే, రెవెన్యూ డివిజన్లను పునర్వ్యస్తీకరించడం జరిగింది. అదేవిధంగా పంచాయితీలను కూడా పునర్వ్యస్తీకరించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈలోగా పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించవలసిరావడంతో పంచాయితీరాజ్ శాఖలో అయోమయ పరిస్థితి ఏర్పడింది. 

జూలై నెలాఖరులోగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించబోతున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. కనుక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే వరకు పంచాయితీలలో ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, బదిలీల ప్రక్రియ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 12,751 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. తండాలకు కూడా పంచాయితీ హోదా కల్పిస్తామనే సిఎం కెసిఆర్ హామీని అమలుచేయలంటే మరికొన్ని కొత్త పంచాయితీలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. కానీ పంచాయితీ ఎన్నికల గడువు దగ్గర పడుతున్న ఈ సమయంలో ఇప్పుడు కొత్త పంచాయితీలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే ఊహించని కొత్త సమస్యలు పుట్టుకు రావచ్చునని అధికారులు సందేహిస్తున్నారు. పైగా శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది కనుక కొత్తపంచాయితీల ఏర్పాటుకు ఇప్పుడు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడం సాధ్యం కాదు. ఒకవేళ తండాలను పంచాయితీలుగా మార్చాలనుకుంటే ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత కొత్తగా ఏర్పడే పంచాయితీలలో గడువులోగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. కనుక పంచాయితీరాజ్ శాఖా అధికారులు కొత్త పంచాయితీల ఏర్పాటుకు సంబంధించిన  ఫైల్ తయారుచేసి సిఎం కెసిఆర్ కార్యాలయానికి పంపించారు. దీనిపై ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


Related Post