కోమటిరెడ్డి కేసు కాంగ్రెస్ మెడకు చుట్టుకుందా?

June 04, 2018


img

తెరాస సర్కార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వాలను రద్దు చేసినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఓ మూడు నాలుగు రోజులు హడావుడి చేసినప్పటికీ, ఆ తరువాత దానిని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. హైకోర్టు తీర్పులు తెరాస సర్కార్ కు వ్యతిరేకంగా వస్తున్నప్పటికీ టి-కాంగ్రెస్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యకరమే. అందుకు కారణం ఇదివరకు వెంకటరెడ్డి, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసి, అయన తక్షణం ఆ పదవిలో నుంచి దిగిపోవాలని లేకుంటే తాను వేరే దారి(?) చూసుకోవలసి ఉంటుందని హెచ్చరించడమే కావచ్చు. అది మనసులో పెట్టుకునే టి-కాంగ్రెస్ పెద్దలు తమ శాసనసభ్యత్వాల రద్దును వ్యతిరేకిస్తూ తెరాస సర్కార్ తో గట్టిగా పోరాడటంలేదని వెంకటరెడ్డి భావించడం సహజమే. 

మళ్ళీ ఈరోజు కూడా హైకోర్టు ధర్మాసనం వారిరువురికి అనుకూలంగా తీర్పు చెప్పినప్పటికీ, టి-కాంగ్రెస్ లో పెద్దగా స్పందన కనబడకపోవడం విశేషం. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిల తీరుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు ఇంత అన్యాయం జరుగుతుంటే, న్యాయస్థానం కూడా తమనే సమర్దిస్తుంటే, రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ఇప్పటికీ తెరాస సర్కార్ తమ సభ్యత్వాలను పునరుద్దరించకపోయినట్లయితే, అందుకు నిరసనగా అందరూ కలిసి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే బాగుంటుందని తాను జానారెడ్డితో చెప్పానని వెంకటరెడ్డి చెప్పారు. 

మీడియాలో వస్తున్న ఈ వార్తలపై జానారెడ్డి స్పందిస్తూ, “కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిధంగా చెప్పడం నిజమైతే అయన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. రాజీనామాల గురించి అయన మాతో అసలు మాట్లాడనే లేదు. ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే నేనే మొట్టమొదట రాజీనామా చేస్తాను. ఆయన ఏదో ఆవేదనలో ఆవిధంగా మాట్లాడి ఉండవచ్చు కానీ టి-కాంగ్రెస్ వారిరువురికి అండగా నిలబడి తెరాస సర్కార్ తో పోరాడుతుంది,” అని అన్నారు. 

ఈ వ్యవహారంలో తెరాస సర్కార్ ఎదురుదెబ్బలు తింటుంటే, దానిని అవకాశంగా తీసుకొని అందరూ కలిసికట్టుగా దానిపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయకుండా, టి-కాంగ్రెస్ నేతలు ఈవిధంగా తమలో తామే కలహించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. టి-కాంగ్రెస్ పైకి చాలా బలంగా కనిపిస్తున్నప్పటికీ నేతల మద్య ఇటువంటి విభేదాలు నెలకొని ఉన్నాయని, వారి మద్య సఖ్యతలేదని వారే స్వయంగా చాటింపు వేసుకొంటున్నట్లు వ్యవహరిస్తున్నారు. వారి అనైఖ్యతే తెరాసకు శ్రీరామరక్ష కావచ్చు.  


Related Post