దేశంలో గొప్ప రైతులు ఎవరంటే... తెలంగాణావైపు చూడాలి: కెసిఆర్

June 04, 2018


img

ఆగస్ట్ 15వ తేదీ నుంచి రాష్ట్రంలో రైతులందరికీ ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా జీవిత భీమాను అందించబోతోంది. ఇవాళ్ళ హైదరాబాద్ లో సిఎం కెసిఆర్ రైతుబంధు, జీవిత భీమా పధకాలపై సంబంధిత శాఖ అధికారులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలోనే సంబంధిత శాఖ -ఎల్.ఐ.సి. సంస్థ అధికారులు రైతుభీమా పధకం ఒప్పందపత్రంపై సంతకాలు చేశారు. 

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాష్ట్రంలో 57 లక్షల మంది రైతులకు ఈ జీవిత భీమా పూర్తి ఉచితంగా అందిస్తున్నాము. వారు దీనికోసం ఒక్క పైసా కూడ చెల్లించనవసరం లేదు. ప్రభుత్వమే వారి ప్రీమియం చెల్లిస్తుంది. దేశంలో మొట్టమొదటిసారిగా అమలు చేస్తున్న ఈ పధకం కోసం దేశంలో అత్యంత విశ్వసనీయమైన ఎల్.ఐ.సి. సంస్థను ఎంచుకున్నాము. రైతు ఏ కారణం చేత చనిపోయినప్పటికీ, వారి కుటుంబ సభ్యులు స్థానిక పంచాయితీ నుంచి మరణ దృవీకరణ పత్రం తీసుకొని సమర్పిస్తే చాలు..ఎల్.ఐ.సి. సంస్థ వారికి 10 రోజులలోపే రూ.5 లక్షలను అందజేస్తుంది. ఇంటిపెద్దను కోల్పయిన రైతు కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడేందుకు ఇది పనికివస్తుందని నేను భావిస్తున్నాను,” అని అన్నారు. 

రైతుబంధు గురించి వివరిస్తూ రైతన్నలకు అత్యవసరమైన సమయంలో పంటపెట్టుబడి కోసం ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించడం ద్వారా వారు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా కాపాడాలనే ఉదేశ్యంతోనే దీనిని అందజేస్తున్నాము. దీని కోసం బ్యాంకులలో జమా చేసిన సొమ్ములో ఇప్పటి వరకు మన రైతులు రూ.5,000 కోట్లు నగదును తీసుకున్నారు. రాష్ట్రంలో రైతులందరూ సంఘటితశక్తిగా మారినప్పుడే వారి జీవితాలు బాగుపడతాయి. విత్తనం నాటే సమయం నుంచి పండిన పంటలను గిట్టుబాటు ధరలకు అమ్ముకునేవరకు ప్రతీదీ రైతుల నియంత్రణలో ఉన్నప్పుడే రైతుల జీవితాలు బాగుపడతాయి. అందుకే తెలంగాణా రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేశాము. 

రాష్ట్రంలో ఏ భూమి ఏ పంటకు అనుకూలం... ఏ ప్రాంతంలో ఏ పంట ఎంత వేయాలి? ఎప్పుడు వేయాలి? దానిని ఎప్పుడు మార్కెట్లకు తరలించాలి? ఆ పంటకు ఎంత ధర డిమాండ్ చేయాలి? మొదలైనవన్నీ రైతుసంఘాలే నిర్ణయించుకునే స్థాయికి ఎదగాలి. ఏవిధంగా ముందుకు సాగితే రైతన్నలకు లాభం కళ్ళజూసే అవకాశం ఉందో వ్యవసాయ అధికారులు, తెలంగాణా రైతు సమన్వయ సమితిలు మార్గదర్శనం చేయాలి. ఒక పద్ధతి ప్రకారం ముందుకు సాగినట్లయితే ఇది సాధ్యమే. 

దేశంలో అందరి కంటే గొప్ప, ధనికుడైన ఆధునిక సాగు మెళకువలు తెలిసిన రైతు ఎక్కడున్నాడు? అంటే అందరూ మన తెలంగాణా రైతన్నలను చూపించే స్థాయికి ఎదగాలి. ఇది రాత్రికి రాత్రే జరిగిపోదు. కానీ ప్రభుత్వమూ, అధికారులు, రైతన్నలు అందరూ కలిసి సమన్వయంతో కలిసి ముందుకు సాగినట్లయితే తప్పకుండా సాధ్యమే. కనుక ఈ సదస్సులో అధికారులు, తెలంగాణా రైతు సమన్వయ సమితి సభ్యులు అందరూ కలిసి కూర్చొని చర్చించుకొని రైతులకు మేలు కలిగించే నిర్ణయాలను, విధానాలను రూపొందించుకోవాలని కోరుకొంటున్నాను. మీకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలబడుతుందని హామీ ఇస్తున్నాను,” అని సిఎం కెసిఆర్ అన్నారు.


Related Post