భాజపాలోకి కాంగ్రెస్, తెరాస కార్యకర్తలు?

June 04, 2018


img

తెలంగాణా రాష్ట్రంలో తెరాస, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే చాలా బలంగా కనిపిస్తున్నాయి. కేంద్రంలో భాజపాయే అధికారంలో ఉన్నప్పటికీ, రాష్ట్ర భాజపా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపొయిందనే చెప్పక తప్పదు. ఇక కేంద్రానికి కూడా రాష్ట్ర భాజపా పట్ల చిన్నచూపు ఉందని బండారు దత్తాత్రేయను కేంద్రమంత్రి పదవిలో నుంచి తప్పించినప్పుడే అర్ధం అయ్యింది. వాస్తవానికి కేంద్రప్రభుత్వం రాష్ట్ర భాజపా నేతలతో కంటే తెరాస సర్కార్ తో ఎక్కువ సఖ్యతగా వ్యవహరిస్తోంది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య అటువంటి సయోధ్య, అవగాహన ఉండటం చాలా అవసరమే కానీ అది భాజపా-తెరాసల దోస్తీగా కనిపిస్తున్న కారణంగా రాష్ట్ర భాజపా నేతల చేతులు కట్టేసినట్లు అయ్యింది. ఆ కారణంగా వారు తెరాస సర్కార్ పై ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నప్పటికీ వాటిని ప్రజలెవరూ పట్టించుకోవడం లేదు. కనుక రాష్ట్ర భాజపా ఒకరకమైన నిసహాయస్థితిలో ఉంది. అందుకే మోడీ నామస్మరణతో కాలక్షేపం చేయకతప్పడం లేదు. ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికలలో భాజపా పరిస్థితి ఏమిటి? అది కనీసం ఇప్పుడున్న సీట్లనైనా గెలుచుకోగలదా లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

కానీ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ మాత్రం యధాప్రకారం వచ్చే ఎన్నికలలో తమ పార్టీయే విజయం సాధించడం ఖాయం అని చెప్పుకొంటూనే ఉన్నారు. ఆదివారం హాన్ నగరంలో ఉప్పల్ కు చెందిన కొందరు కాంగ్రెస్, తెరాస, తెదేపా కార్యకర్తలు భాజపాలో చేరారు. ఆ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ, “దేశ వ్యాప్తంగా ప్రజలు అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఎన్నికలలో తీర్పు ఇస్తున్నారు. తెలంగాణాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలలో తెరాస సర్కార్ అవినీతి, నిరంకుశపాలనకు ప్రజలు ముగింపు పలుకబోతున్నారు. రాష్ట్ర ప్రజలు తెరాస కుటుంబపాలనతో విసుగెత్తిపోయున్నారు. కాంగ్రెస్, తెరాసల పాలన ఏవిధంగా ఉంటుందో తెలంగాణా ప్రజలు చూశారు కనుక ఇప్పుడు అందరూ భాజపావైపే చూస్తున్నారు. ఎందుకంటే కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో తెలంగాణా ప్రజలు తెరాసను గద్దె దించి భాజపాకే పట్టం కట్టడం ఖాయం,” అని అన్నారు. 


Related Post