తెలంగాణాలో కాంగ్రెస్ ఎన్నికల వ్యూహం ఏవిధంగా ఉంటుందో?

June 02, 2018


img

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రంజాన్ పండుగ తరువాత తెలంగాణా రాష్ట్రంలో పర్యటించబోతున్నట్లు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి  మీడియాకు తెలియజేశారు. రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ నేతలతో కలిసి రెండు రోజులు బస్సు యాత్రలో పాల్గొంటారని తెలిపారు. బస్సు యాత్ర పూర్తయిన తరువాత హైదరాబాద్ లో నిర్వహించబోయే బారీ బహిరంగసభలో రాహుల్ గాంధీ పాల్గొంటారని తెలిపారు. ఈసభలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులు, విద్యార్ధి సంఘాల నేతలు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ కుంతియా స్థానంలో సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి సిఎం కెసిఆర్ పరోక్షంగా సహాయం చేసినట్లే చెప్పవచ్చు. అయన జెడిఎస్ కు మద్దతు ప్రకటించడంతో కర్ణాటకలో తెలుగుప్రజలు దానికే మొగ్గు చూపారు. ఆ పార్టీతో చేతులు కలిపినందున కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఓడినా మళ్ళీ అధికారంలోకి రాగలిగింది. కానీ తెలంగాణాలో కాంగ్రెస్-తెరాసలు బద్ధశత్రువులుగా ఉన్నాయి. కనుక తెలంగాణాలో తెరాసకు బదులు వేరే పార్టీల సహకారం తీసుకోవలసి ఉంటుంది. 

గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ ఆ రెండు రాష్ట్రాలలో ఎన్నికల అనుభవాలు దానికి అనేక కొత్త పాఠాలు నేర్పించాయి. తెలివిగా, చురుకుగా, పట్టువిడుపులతో వ్యవహరిస్తే భాజపాను ఏవిధంగా కట్టడి చేయవచ్చో అది బాగా నేర్చుకుంది. ఒకవేళ ఎన్నికలలో ఓడిపోయినా అధికారం ఏవిధంగా చేజిక్కించుకోవచ్చో నేర్చుకుంది. అలాగే తెదేపా వంటి కొత్తమిత్రులను కూడా సంపాదించుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తులకు సిద్దమని చంద్రబాబు నాయుడు సంకేతాలు పంపారు. కనుక తెలంగాణాలో తెదేపాతో చేతులు కలపడం ద్వారా తెరాసకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించవచ్చు. 

రాహుల్ గాంధీ తెలంగాణా పర్యటన సందర్భంగా ఎన్నికల పొత్తుల గురించి స్పష్టత ఇస్తారేమో చూడాలి. దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణా రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది కనుక తెలంగాణా రాష్ట్రంపైనే రాహుల్ గాంధీ ఎక్కువ దృష్టిపెట్టవచ్చు. కనుక ఇక నుంచి తరచూ తెలంగాణా పర్యటనలకు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.


Related Post